రాజ్యసభలో మార్పులపై ‘5’ కీలక సూచనలు చేసిన విజయేంద్రప్రసాద్
రాజ్యసభకు నామినేట్ అయిన రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. తనకు ఎదురైన అనుభవాల ఆధారంగా ఆయన సూచనలు చేసి.. వాటిని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ కు ఒక లేఖ రాశారు.;
వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కొలువు తీరే రాజ్యసభలో ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు.. స్టార్లు వచ్చారు.. వెళ్లారు. వీరికి భిన్నంగా ప్రముఖ సినీ కథారచయిత.. అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేయటం.. ఆ పదవిలో రెండున్నరేళ్లు పూర్తి చేసిన నేపథ్యంలో రాజ్యసభను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు వీలుగా ఆయన ‘5’ కీలక సూచనలు చేశారు.
రాజ్యసభకు నామినేట్ అయిన రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. తనకు ఎదురైన అనుభవాల ఆధారంగా ఆయన సూచనలు చేసి.. వాటిని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ కు ఒక లేఖ రాశారు. అందులో ఆయన ప్రస్తావించిన ఐదు అంశాల్ని చూస్తే.. కాలంతో పాటు మారాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. మరి.. వీటికి రాజ్యసభ ఛైర్మన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
సూచన 1
పార్లమెంట్ కు వచ్చిన రాజ్యసభ సభ్యుడి హాజరును.. అక్కడి అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయాలి. ఇలా సంతకాలు చేస్తున్న కొందరు సభలోకి రాకుండానే బయటకు వెళ్లిపోతున్నారు. వారు సభలోకి రాకున్నా సభకు హాజరైనట్లుగా హాజరు పట్టిక చెబుతోంది. ఈ లోపాన్ని సరిదిద్దాలి. రాజ్యసభ తలుపుల వద్ద కెమెరాల్ని ఏర్పాటు చేసి.. సభ్యుల ఎంట్రీ.. ఎగ్జిట్ ను నమోదు చేయాలి.
సూచన 2
సభలో ఎవరైనా సభ్యులు మాట్లాడే సమయంలో ఫోటోలు.. వీడియో క్లిప్పులను చూపుతూ తమ వాదనల్ని మరింత సమర్థంగా వినిపించేందుకు వీలుగా ఉండాలి. ఇందుకు ప్రతి సభ్యుడి టేబుల్ మీద ఉండే ట్యాబ్ ను సభలోని టీవీ మానిటర్ తో అనుసంధానం చేయాలి. సభ్యుల వాదనకు సంబంధించిన గ్రాఫిక్స్ ను.. ఫోటోల్ని ప్రదర్శిస్తూ తమ వాదనల్ని వినిపించే వీలు కల్పించాలి.
సూచన 3
సభ్యుల ప్రశ్నలకు సభలో మంత్రులు మౌఖికంగా సమాధానాలు ఇస్తున్నారు. అందులో అనుమానాల్ని క్లియర్ చేసుకోవటానికి సమయం ఉండటం లేదు. ఈ లోపాన్ని పరిహరించేందుకు మంత్రులు తమ సమాధానాల్ని ముందు రోజే పంపిణీ చేయాలి. అలా చేస్తే ఆ సమాధానాల్ని సభ్యులు చదివి మరింత అర్థవంతమైన అనుబంధ ప్రశ్నలు వేసే అవకాశం లభిస్తుంది.
సూచన 4
రాజ్యసభను ఉదయం 11 గంటలకు కాకుండా తొమ్మిది గంటలకే సమావేశం అయ్యేలా చూడాలి. ఈ రెండు గంటల అదనపు సమయంలో తమ రాష్ట్రాల సమస్యలపై మాట్లాడాలని భావించే సభ్యులందరికి అవకాశం ఇవ్వాలి.
సూచన 5
మనిషి సగటు జీవితకాలం 77 ఏళ్లకు పైగా పెరిగింది. చాలామంది రిటైర్ అయిన ఉద్యోగులు 70 ఏళ్ల వయసులో చలాకీగా ఉంటున్నారు. వారి సుదీర్ఘ అనుభవాన్ని సరిగా ఉపయోగించుకోవటానికి.. గంగ.. యమునా నదీ పరివాహక ప్రాంతాల్లో ఏటా వచ్చే వరదల నివారణ తదితర సంక్లిష్ట అంశాలపై పరిశోధనలు చేసి పరిష్కారాన్ని చూపే ఆసక్తి ఉన్న సభ్యులతో ఒక ప్యానల్ ఏర్పాటు చేయాలి. సదరు ప్యానల్ కు దేశ.. విదేశీ నిపుణులతో చర్చించే అధికారాన్ని కల్పించాలి. వారు ప్రతిపాదించే పరిష్కారాలను సభలో చర్చించి.. ఆచరించేలా ఉంటే ఉభయ సభల్లో ఆమోదం పలికేలా చేయాలి.