చేప కొరికింది.. చేతిని తీసేశారు.. ఎక్కడంటే?
విన్నంతనే ఉలిక్కిపడేలా ఉండే ఈ ఉదంతం ఆసక్తికరంగానే కాదు షాకిచ్చేలా మారింది. చేప కొరికినందుకు చేతిని తీసేయాల్సి రావటమా? అన్న సందేహం కలగొచ్చు.;
విన్నంతనే ఉలిక్కిపడేలా ఉండే ఈ ఉదంతం ఆసక్తికరంగానే కాదు షాకిచ్చేలా మారింది. చేప కొరికినందుకు చేతిని తీసేయాల్సి రావటమా? అన్న సందేహం కలగొచ్చు. అలాంటి పరిస్థితిని కేరళకు చెందిన 38 ఏళ్ల రాజేశ్ అనే వ్యక్తి ఎదుర్కొంటున్నారు. కన్నూర్ జిల్లాలోని థలస్సెరీకి చెందిన రాజేశ్ ఫిబ్రవరి 10న తన పొలంలో చెరువును శుభ్రం చేస్తున్నాడు.
ఈ సమయంలో ‘కడు’ అనే రకం చేప అతడి చేతి వేలిని కొరికింది. దీంతో కుడి చేతి వేలి మీద చిన్న గాయమైంది చికిత్స చేయించుకున్న అతడికి గాయం తగ్గకపోగా.. అర చేతిపై బొబ్బలు రావటంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే.. వైద్యుల్ని సంప్రదించగా.. వివిధ రకాలైన పరీక్షలు చేశయించారు. చివరకు గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినట్లుగా తేల్చారు. దీని నుంచి బయటపడాలంటే ఈ బ్యాక్టీరియా వ్యాపించిన భాగాన్ని తీసివేయటానికి మినహా మరో అవకాశం లేదు.
దీంతో తొలుతఅతడి చేతి వేళ్లను.. ఆ తర్వాత అరచేతిని పూర్తిగా తీసేయాల్సి వచ్చింది. ఈ బ్యాక్టీరియాతో ఉండే మరో ప్రమాదం ఏమంటే.. ఇది కానీ మెదడుకు వ్యాపిస్తే ప్రాణాలకే ప్రమాదంగా వైద్యులు చెబుతున్నారు. ఇసుక.. బురద నీటిలో క్లోస్ట్రిడియం పెర్పింజెన్స్ అనే బ్యాక్టీరియా ఇలాంటి ఇన్ఫెక్షన్లు రావటానికి కారణంగా వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు అర్థమైందా? చిన్న చిన్న అంశాలు ఒక్కోసారి ఎంత తీవ్రమైన పరిస్థితికి తీసుకెళతాయో?