ప్రతి దానికి దేశం విడిచి పోవటమే పరిష్కారమా?
ఈ దేశం అందరిది. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. అలానే ఒక మతానికి.. కులానికి.. ప్రాంతానికి.. భాషకు మాత్రమే పరిమితమయ్యేది కాదన్న విషయం ప్రతి భారతీయుడికి తెలుసు.;
ఈ దేశం అందరిది. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. అలానే ఒక మతానికి.. కులానికి.. ప్రాంతానికి.. భాషకు మాత్రమే పరిమితమయ్యేది కాదన్న విషయం ప్రతి భారతీయుడికి తెలుసు. భిన్నత్వంలో ఏకత్వమే భారత ఆత్మ. అందరికి తెలిసిన.. అర్థమైన విషయాన్ని భావోద్వేగాల్ని రెచ్చగొట్టేలా మాట్లాడి.. విభజన తెచ్చే కొందరు రాజకీయ నేతల పుణ్యమా అని మనుషుల మధ్య విభజన అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
నిజానికి నాగరిక సమాజంలో అంతరాలు తగ్గిపోయి.. అనుబంధాలు పెరగాలి. కానీ.. గడిచిన పాతికేళ్లను చూస్తే.. దేశంలో ఎవరి వాదాన్ని వారు మరింత బలంగా వినిపించే ప్రయత్నం చేయటంతో పాటు.. ఎవరి వృత్తంలో వారు ఉండిపోతున్న దుస్థితి. తాము నమ్మిందే నిజమనుకోవటం.. తాము పాటించే ధర్మానికి మించింది మరొకటి లేదన్న భావన ఎక్కువ అవుతోంది. గతంలోని సోదరభావానికి భిన్నంగా అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి తీరు ఈ దేశానికి మంచిది కాదు.
ఎదుటి వారి తిరస్కరణను భరించటం ఎవరికైనా కష్టమే. ఆ విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు. హిందూ-ముస్లిం మధ్య సఖ్యత ఈ దేశానికి చాలా ముఖ్యం. ఇందుకోసం రెండు వర్గాల మధ్య అపోహలు తగ్గించుకునే ప్రయత్నంచేసి.. అనుబంధాల్ని పెంచే కార్యక్రమాలకు పాలకులు మొదలు ప్రజలు వరకు అందరూ నడుం బిగించాల్సి ఉంటుంది. అనవసర అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం.. ఒకరిద్దరు చేసే తప్పులకు అందరిని బాధ్యుల్ని చేయటంలోనూ అర్థం లేదు.
దీనికి క్లాసిక్ ఎగ్జాంఫుల్ గా ఉత్తరప్రదేశ్ కు చెందిన నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిసాద్ వ్యాఖ్యల్ని చెప్పొచ్చు. హోలీ రంగులతో సమస్య ఉన్న వారు నిరభ్యంతరంగా దేశం విడిచి వెళ్లిపోవచ్చంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల తీరు సమాజంలో విభజనకు కారణమవుతుందన్న ఆయన.. హోలీ వేడుకలను మతంతో ముడిపెడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా ఆక్షేపించారు.
ఈ మాటలు చెబుతున్న పెద్ద మనిషి సైతం.. హోలీ రంగులతో అభ్యంతరం ఉంటే.. దేశం విడిచి వెళ్లిపోవాలన్న తీవ్రమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అన్నది మరో ప్రశ్న. శుక్రవారం ప్రార్థనలు.. హోలీ వేడుకలు రెండూ ఐక్యతను చాటే పండుగలని.. కొందరు రాజకీయ నాయకులకు ఇది నచ్చటం లేదని ఆయన మండిపడుతున్నారు. కొందరి మనసుల్ని విషపూరితం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఇన్ని మంచి మాటలు చెప్పిన నేత సైతం.. చివరకు మాత్రం దేశం విడిచి పెట్టి వెళ్లిపోవాలన్న వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. నిజానికి.. తప్పుడు మాటలు చెప్పే వారిని.. ఆ మాటల్ని ప్రచారం చేసే వారిని సూటిగా టార్గెట్ చేస్తే బాగుంటుందే తప్పించి.. అందుకు భిన్నంగా చేసే వ్యాఖ్యలు మిగిలిన వారిని సైతం ఇబ్బందులకు గురి చేస్తాయన్నది మర్చిపోకూడదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కానీ.. అదేదీ దేశం విడిచి పెట్టి వెళ్లిపోయేంత మాట మాత్రం మాట్లాడకూడదు. ఆ విషయంలో రాజకీయ నేతలు సంయమనాన్ని పాటించాల్సి అవసరం ఉంది.