హోలీ వేళ ఆడోళ్లు మాత్రమే ఊళ్లో ఉండే అరుదైన సంప్రదాయం

ఇవాళ హోలీ. ఆనందోత్సోహాలతో చేసుకునే ఈ పండుగ వేళ.. దేశంలో మరెక్కడా లేని రీతిలో ఒక అసాధారణ సంప్రదాయం రాజస్థాన్ లోని ఒక గ్రామంలో ఉంది.;

Update: 2025-03-14 04:32 GMT

ఇవాళ హోలీ. ఆనందోత్సోహాలతో చేసుకునే ఈ పండుగ వేళ.. దేశంలో మరెక్కడా లేని రీతిలో ఒక అసాధారణ సంప్రదాయం రాజస్థాన్ లోని ఒక గ్రామంలో ఉంది. ఈ పండుగ రోజున ఊళ్లో మహిళలు మాత్రమే ఉండగా.. పురుషులంతా ఊరు విడిచి బయటకు వెళ్లిపోవాల్సిందే. ఇలాంటి అరుదైన సంప్రదాయాన్ని 500 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పురుషులు ఊళ్లోనే ఉండిపోతే.. వారు బహిష్కరణ వేటుకు గురి కావాల్సిందే.

నిజానికి దేశంలో ఇప్పటికి మహిళల్ని పర్దా వ్యవస్థలో ఉంచిన రాజస్థాన్ లో ఇలాంటి ఆచారం ఉండటం ఆసక్తికరమని చెప్పాలి. ఇంతకూ ఆ ఊరేంటి? అక్కడ హోలీని ఎలా నిర్వహిస్తారన్నది చూస్తే.. రాజస్థాన్ లోని టోంక్ జిల్లాలో నాగర్ అనే గ్రామం ఉంది. ఈ ఊళ్లో అసాధారణ సంప్రదాయం ఉంది. హోలీ పండుగ వేళ ఉదయం పది గంటలు కాగానే.. ఊరికి చెందిన పురుషులు (ఐదేళ్లు దాటిన వారంతా) గ్రామాన్ని వదిలి పెట్టి.. శివారులో ఉన్న చాముండేశ్వరీ దేవి ఆలయానికి వెళతారు. అక్కడ వారు జాతర చేసుకుంటారు. భక్తిగీతాలు వింటూ రోజంతా గడుపుతారు.

ఇదే సమయంలో ఊళ్లోని మహిళలంతా.. గ్రామాన్ని అందంగా అలంకరించి రంగులు జల్లుకుంటూ శోభాయమానంగా మారుస్తారు. వయసుతో సంబంధం లేకుండా ఆనందోత్సాహాల్లో మునిగిపోతారు. ఈ పండుగను ఇష్టపడని వారు సైతం కచ్ఛితంగా హోలీ ఆడిస్తారు. కొందరు మహిళలు పురుషుల వేషధారణతో వేడుకల్లో పాల్గొనటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఇదంతా చదివిన తర్వాత మగాళ్లకు హోలీ పండుగ ఉండదా? అన్న సందేహం రావొచ్చు.

ఆసక్తికర అంశం ఏమంటే.. హోలీ తర్వాతి రోజున పురుషులు.. మహిళలు అంతా కలిసి హోలీ పండుగను చేసుకుంటారు. రంగులు జల్లుకోవటమే కాదు.. పురుషులను సరదాగా కొరడాలతో కొట్టే విచిత్రమైన సంప్రదాయం కూడా ఉంది. అంటే.. ఈ ఊళ్లో హోలీ పండుగను ఒక రోజు కాకుండా రెండో రోజులు జరుపుకుంటారన్న మాట. ఈ రెండు రోజుల పండుగను పెద్ద వేడుకలా జరుపుకోవటంతో ముగుస్తుంది.

Tags:    

Similar News