కొత్త జిల్లాల ఏర్పాటు.. చంద్రబాబుకు తలనొప్పులు!
ఇటీవల చంద్రబాబు మార్కాపురంలో పర్యటించినప్పుడు.. పెద్ద ఎత్తున ఈ వ్యవహారంపై ప్రజల నుంచి డిమాండ్లు వినిపించాయి.;
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం సీఎం చంద్రబాబు కు తలనొప్పులుగా మారుతోంది. వాస్తవా నికి వైసీపీ హయాంలోనే రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. అయితే.. అప్పట్లో ప్రజలు మరికొన్ని జిల్లాల ఏర్పాటు కోసం ఉద్యమించారు. మదనపల్లె, మార్కాపురం, వినుకొండ కేంద్రంగా గుర్రం జాషువా జిల్లా ఏర్పాటు, రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా మార్పు(ప్రస్తుతం రాయచోటి కేంద్రంగా ఉంది), ప్రస్తుతం కృష్నాజిల్లా పేరును మార్చి ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చాలని, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా పేరును కృష్ణాగా మార్చాలని డిమాండ్ ఉంది.
ఇవన్నీ.. వైసీపీ హయాంలోనే తెరమీదికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రజల డిమాండ్లను పరిగణన లోకి తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తాము అధికారంలోకి వచ్చాక ఆయా జిల్లాల పేర్లు మార్చ డంతోపాటు.. కొత్తవాటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే.. అధికారంలోకి వచ్చి 10 మాసాలు అయినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. తాజాగా ఇప్పుడు ప్రజల నుంచి ఇవే డిమాండ్లు తెరమీదికి వచ్చాయి.
ఇటీవల చంద్రబాబు మార్కాపురంలో పర్యటించినప్పుడు.. పెద్ద ఎత్తున ఈ వ్యవహారంపై ప్రజల నుంచి డిమాండ్లు వినిపించాయి. ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన కూడా నిర్వహించారు. ఇక, టీడీపీనిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమానికి రెండు రోజుల కిందట.. కృష్నా జిల్లా పేరు మార్పుపై ఎన్టీఆర్ సేన పేరుతో కొందరు వినతి పత్రాలు సమర్పించారు. మదన పల్లెలోనూ ఇదే చర్చ సాగుతోంది. ఇక, రాజంపేటలో గతంలో నిరసన వ్యక్తం చేసిన వారు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేకు వినతులు సమర్పిస్తున్నారు.
అంటే మొత్తంగా.. రాష్ట్రంలో జిల్లాల పేర్లు మార్పుతోపాటు.. కొత్త జిల్లాల ఏర్పాటుపై కదలిక ప్రారంభమైం ది. అయితే.. ఇది అనుకున్నంత తేలిక విషయం కాదు. ఒక్కసారి ఈ విషయాన్ని కదిలిస్తే.. భవిష్యత్తులో మరిన్ని డిమాండ్లు తెరమీదికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎడతెగని అంశంగా కూడా.. మారనుంది. దీంతో ప్రభుత్వం ఏం చేయాలన్న విషయంపై తర్జన భర్జన పడుతోంది.