నాగబాబు ఒక ఆట ఆడుకుంటారా ?
అయితే ఏతా వాతా తేలేది ఏంటి అంటే ఆ 25వ మంత్రి పదవి పూర్తిగా నాగబాబు కోసమే అని. అంటే ఖాళీ అక్కడ ఉంది. అభ్యర్థి ఇక్కడ ఉన్నారు.;
మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుకు రాజయోగం ముఖ ద్వారం నుంచే తోసుకుని వస్తోంది. అందుకే ఎలాంటి హైరానా లేకుండా ఇలా నామినేషన్ వేసి అలా పెద్దల సభలో సభ్యుడు అయిపోయారు. 2031 మార్చి 30 వరకూ నాగబాబు పదవికి వచ్చిన ఢోకా అయితే లేదు. హాయిగా ఆరేళ్ళ పాటు శాసనమండలిలో ఆయన సభ్యుడిగా హవా చలాయిస్తారు.
అయితే నాగబాబు పెద్దల సభలో పెద్ద మనిషిగా కూర్చోవడానికే ఈ పదవిని చేపట్టలేదు అని అందరికీ తెలుసు అని అంటారు. ఆయనకు కేబినెట్ బెర్త్ వెంటనే రెడీ అన్న భారీ ఆఫర్ ఉంది కాబట్టే ఎమ్మెల్సీ అయ్యారు అని అంటున్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా నెగ్గారు. సో ఇపుడు జరగాల్సిన లాంచనం ఏంటి అంటే మంత్రి కావడమే. అది ఎపుడు అంటే సాధ్యమైనంత తొందరలోనే అని అంటున్నారు.
జనసేనకు నాలుగు మంత్రి పదవులు అన్నది టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుతోనే బాబు నిర్ణయించారని అందుకే ఒక ఖాళీని అలా అట్టేబెట్టి 24 మంది మంత్రులనే తీసుకున్నారు అని అంటున్నారు. ఆ విషయం తెలియని కొందరు తమ్ముళ్ళు ఆ ఒక్క బెర్త్ తమకోసమే అని అనుకున్నారని చెబుతారు. ఇక బీజేపీ అయితే తమకు రెండవ బెర్త్ అన్నది ఇస్తారని ఆశపడుతూ వస్తోంది.
అయితే ఏతా వాతా తేలేది ఏంటి అంటే ఆ 25వ మంత్రి పదవి పూర్తిగా నాగబాబు కోసమే అని. అంటే ఖాళీ అక్కడ ఉంది. అభ్యర్థి ఇక్కడ ఉన్నారు. ఇక ఆలస్యం ఏముంది. వరమాల మెడలో వేసేయడమే అని అంటున్నారు. సో మంచి ముహూర్తం చూసి నాగబాబు చేత మంత్రిగా ప్రమాణం చేయిస్తారు అని అంటున్నారు.
ఇక నాగబాబుకు ఏ శాఖ ఇస్తారు అన్నది చాలా కాలంగా మెయిన్ స్ట్రీం మీడియాలో సోషల్ మీడియా నలుగుతున్న విషయమే. ఆయన సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారని అంటే లేదు పర్యాటక శాఖ అని రాసేవారు ఉన్నాఉర్. లేదు ఆయనకు మత్స్య శాఖ ఇస్తారని అంటే అదీ ఇదీ కాదు కీలకమైన టాప్ ఫైవ్ శాఖలలో ఒకటి అని కూడా ప్రచారం చేశారు.
అయితే నాగబాబు పాలనకు కొత్త కావడంతో ఆయన మీద భారం మోపేలీ కీలక శాఖలు ఇస్తారని ఎవరూ అనుకోవడం లేదు అంటున్నారు. అదే సమయంలో జనంతో సంబంధం లేని శాఖలను కూడా ఇవ్వరని అంటున్నారు. అన్న గారి విషయంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్న తీరుకు తగినట్లుగా శాఖలను కేటాయిస్తారు అని అంటున్నారు.
ఆయనకు క్రీడలు యువజన విభాగాల శాఖలను ఇస్తారు అని అంటున్నారు. ఈ రెండు శాఖలూ యువతతో ముడిపడి ఉండడమే కారణం అని అంటున్నారు. ఈ శాఖలతోనే పార్టీని మరింతగా అభివృద్ధి చేసుకోవడమే కాకుండా యువతతో డైరెక్ట్ గా కనెక్ట్ కావచ్చు అన్నది జనసేనాని వ్యూహమని అంటున్నారు.
ఈ శాఖలు ప్రస్తుతం కడప జిల్లాకు చెందిన మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి వద్ద ఉన్నాయి. వీటితో పాటు రవాణా శాఖ కూడా ఆయన వద్ద ఉంది. దానిని మాత్రమే ఆయనకు ఉంచేసి ఈ రెండు కీలక శాఖలను ఆయన నుంచి నాగబాబుకు అప్పగిస్తారు అని అంటున్నారు. నాగబాబుని మంత్రిని చేసి ఏపీ అంతటా పర్యటించేలా చూడాలన్నది పవన్ ఆలోచనగా చెబుతున్నారు. ఏపీలో జనసేన బలోపేతమే లక్ష్యంగా చేసుకుని నాగబాబుని మంత్రిగా చేస్తున్నారు అని అంటున్నారు. సో నాగబాబు రాజకీయ ఆట అలా మొదలవుతుంది అన్న మాట.