రాజకీయ పార్టీల ఉచితాలపై మరో బాంబ్ పేల్చిన నారాయణమూర్తి

ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన నారాయణ మూర్తి.. పారిశ్రామికవేత్తలు వినూత్న సంస్థలను ఏర్పాటు చేస్తే పేదరికం ఎండలో మంచు లాగా ఆవిరైపోతుందని అన్నారు.;

Update: 2025-03-13 11:56 GMT

ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు ఉచిత ప్రయోజనాలు అందించడం గురించి జరుగుతున్న చర్చ మధ్య, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి బుధవారం హాట్ కామెంట్స్ చేశారు. పేదరికాన్ని తొలగించాలంటే ఉచిత ప్రయోజనాలు కాకుండా ఉద్యోగ అవకాశాలు సృష్టించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన నారాయణ మూర్తి.. పారిశ్రామికవేత్తలు వినూత్న సంస్థలను ఏర్పాటు చేస్తే పేదరికం ఎండలో మంచు లాగా ఆవిరైపోతుందని అన్నారు. "మీలో ప్రతి ఒక్కరూ లక్షల కొద్దీ ఉద్యోగాలను సృష్టిస్తారని నాకు ఎలాంటి సందేహం లేదు. అదే పేదరిక సమస్యను పరిష్కరించే మార్గం. ఉచిత ప్రయోజనాలతో ఈ సమస్యను పరిష్కరించలేరు. ఏ దేశమైనా అందులో విజయం సాధించలేదు," అని 78 ఏళ్ల పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త, యువ పారిశ్రామికవేత్తల సమూహాన్ని ఉద్దేశించి అన్నారు.

గత సంవత్సరం యువత 70 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించి చర్చకు కారణమైన మూర్తి.., తనకు రాజకీయాలు లేదా పాలన గురించి అంతగా తెలియదని, కానీ విధాన పరమైన దృష్టికోణంలో కొన్ని సూచనలు చేస్తున్నానని అన్నారు. ప్రయోజనాలను అందిస్తున్నపుడు వాటికి ప్రతిగా ఏదైనా విధంగా ప్రోత్సాహకాలు లేదా నిబంధనలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉదాహరణకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆరు నెలల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం యాదృచ్ఛికంగా కొన్ని గృహాలను సర్వే చేసి, ఆ పిల్లలు ఎక్కువగా చదువుతున్నారా లేదా తల్లిదండ్రుల ఆసక్తి పెరిగిందా అనే విషయాన్ని పరిశీలించాలన్నారు.

ఎన్నికలకు ముందు ఉచిత ప్రయోజనాలను ప్రకటించే రాజకీయ పార్టీల ఆచరణను సుప్రీం కోర్టు కూడా విమర్శించింది. గత నెలలో జరిగిన విచారణలో, ఉచిత రేషన్ , డబ్బులు పొందడం వల్ల ప్రజలు పని చేయడానికి ఆసక్తి చూపడం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. "జాతీయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన స్థాయికి ప్రజలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కానీ ఇలా ఉచిత ప్రయోజనాల వల్ల మనం పరాన్నజీవుల తరగతిని సృష్టిస్తున్నామా?" అని న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్. గవాయ్ మరియు జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్ ప్రశ్నించారు. "దురదృష్టవశాత్తు, ఎన్నికల ముందు ప్రకటించే ఈ ఉచిత పథకాల కారణంగా ప్రజలు పని చేయడానికి ఆసక్తి చూపడం లేదు," అని బెంచ్ వ్యాఖ్యానించింది.

పట్టణ ప్రాంతాల్లో నివాస సదుపాయాలు లేని వారి ఆశ్రయ హక్కు విషయంలో విచారణ సందర్భంగా, ఉచిత రేషన్ , డబ్బు పొందుతున్న ప్రజలు పని చేయకుండానే జీవించగలుగుతున్నారని కోర్టు అభిప్రాయపడింది. "ప్రజలను సమాజ ప్రధాన ప్రవాహంలో భాగస్వామ్యం చేయడం , దేశ అభివృద్ధికి తోడ్పడేలా చేయడం మంచిదికాదా?" అని న్యాయస్థానం ప్రశ్నించింది.

ప్రపంచంలో జనాభా అత్యధిక దేశమైన భారతదేశం, నెలవారీ నగదు బదిలీల ద్వారా 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఆహారం అందజేస్తోంది.

ఈ ఉచితాల ద్వారానే ప్రజలు సోమరిగా మారతారని.. పేదరికం తగ్గదని మరోసారి నారాయణ మూర్తి రాజేసిన మాటల మంటలు ఎంతలా చెలరేగుతాయన్నది వేచిచూడాలి.

Tags:    

Similar News