అన్నతో.. ప్రత్యర్థిని బలహీనం చేస్తున్న సీఎం

తెలంగాణలో మొన్నటివరకు ఒక రాజకీయం.. మరో ఐదేళ్లు ఇంకో రాజకీయం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఒక ఎత్తయితే

Update: 2024-02-11 00:30 GMT

తెలంగాణలో మొన్నటివరకు ఒక రాజకీయం.. మరో ఐదేళ్లు ఇంకో రాజకీయం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఒక ఎత్తయితే.. రేవంత్ రెడ్డి వంటి బీఆర్ఎస్ కు దీటైన నాయకుడు సీఎం కావడం మరో ఎత్తు. సహజంగా నాయకులు రెండు రకాలుగా ఉంటారు. దీర్ఘకాలిక లక్ష్యాలు విధించుకుని ముందుకెళ్లేవారు.. ఈ ఎన్నికలు గట్టెక్కితే చాలు అనుకునేవారు. ఇందులో రేవంత్ మొదటి రకం వారు. ఏనాటికైనా సీఎం కావాలని లక్ష్యం పెట్టుకున్న ఆయన చట్ట సభల సభ్యుడైన 15వ ఏటనే ఈ కోరికను తీర్చుకున్నారు. ఇక మరో 15 ఏళ్లు రాజకీయం ఆయన చేతిలో ఉంది. ఈ నేపథ్యంలోనే తన భావి ప్రణాళికలను దారిలో పెడుతున్నారు.

కొడంగల్ కోటను పటిష్ఠం చేసుకుంటూ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడినుంచి 2009, 2014లో మంచి విజయం సాధించిన ఆయనను 2018లో ఎలాగైనా ఓడించాలని బీఆర్ఎస్ కంకణం కట్టుకుని పనిచేసింది. ఆ సమయంలో నియోజకవర్గంలోకి కూడా అడుగుపెట్టనివ్వకుండా చూసింది. పట్నం నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపి రేవంత్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ అష్ఠ దిగ్బంధనంతో అనూహ్యంగా ఆయన పరాజయం పాలయ్యారు. ఈ పరిణామం ఒకందుకు రేవంత్ కు మేలే చేసింది. 2019 ఎన్నికల్లో ఆయన మల్కాజిగిరి ఎంపీ అయి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి పీపీసీ అధ్యక్షుడిగానూ నియమితులయ్యారు. ఇక మొన్నటి ఎన్నికల్లో కొడంగల్ లో సునాయాసంగానే నెగ్గారు. అయితే, దీనిని మరింత పటిష్టం చేసుకునేందుకు ఆయన ఇప్పటినుంచే ప్రయత్నం చేస్తున్నారు.

మహేందర్ రెడ్డిని చేర్చుకుని..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం ప్రాబల్యం అధికం. తాండూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మహేందర్ రెడ్డి గతంలో మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలి ఎన్నికల ముంగిట ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి ఆగమేఘాల మీద బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం ఇచ్చారు కేసీఆర్. అయితే, ఆ పార్టీ ఎన్నికల్లో ఓటమితో మహేందర్ రెడ్డి మాజీ అయ్యారు. ఎమ్మెల్సీగానే మిగిలిపోయారు. అప్పట్లో ఆగిపోయినా.. ఇప్పుడు మరోసారి ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. రెండు రోజుల కిందట భార్య, జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక మహేందర్ రెడ్డి తమ్ముడే కొడంగల్ లో రేవంత్ ప్రత్యర్థి నరేందర్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన కూడా పార్టీ మారుతారా? అనే ఊహాగానాలు వచ్చినా వాటిని ఖండించారు. ఇక్కడే అసలు కిటుకు ఉంది. నరేందర్ రెడ్డికి అన్న మహేందర్ రెడ్డి పూర్తి అండ. అలాంటి పరిస్థితుల్లో సోదరుడు కాంగ్రెస్ లోకి వెళ్లిపోతే నరేందర్ రెడ్డి బలహీనం కావడం ఖాయం. తద్వారా కొడంగల్ లో రేవంత్ కు ఎదురులేకుండా పోతుంది. దీన్నిబట్టి తేలింది ఏమంటే.. ప్రత్యర్థిని నేరుగా కాకుండా ఇలా కూడా బలహీనం చేయవచ్చని..

Tags:    

Similar News