అనుమల రేవంత్ రెడ్డి అను నేను! స్టేడియం లో బాహుబలి సీన్ రిపీట్!
తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా అనుమల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ సమయంలో ఆయనతోపాటు డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా అనుమల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ సమయంలో ఆయనతోపాటు డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరితోనూ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అభిమానులు "బాహుబలి" సినిమాను గుర్తుకు తెచ్చుకోవడం గమనార్హం.
అవును... బాహుబలి సినిమాలో శివగామి దేవిగా సోనియా గాంధీ సభావేదికపై ఆసీనురాలవ్వగా.. బాహుబలి ప్రభాస్ స్థాయిలో అనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో దీనికి సంబంధించిన వీడియోను బాహుబలి సినిమాతో కంపేర్ చేస్తూ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగం ఈ కార్యక్రమంలో మరో భారీ హైలెట్ అయ్యింది.
ఇలా ప్రమాణస్వీకారం అనంతరం మైకందుకున్న తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... అశేష జనవాహిని అభినందనల నడుమ ప్రసంగం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా... జై సోనియమ్మ, జై జై సోనియమ్మ అని ప్రసంగం మొదలుపెట్టడం గమనార్హం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు
ఈ సమయంలో... సోనియా గాంధీ ఉక్కు సంకల్పం ఇందుకు కారణం అని అన్నారు. అయితే దశాబ్ధ కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దెబ్బతిందని... మానవహక్కులు హరించబడ్డాయని.. ప్రజలు చెప్పుకోవడానికి ప్రభుత్వంలో ఎవరూ లేక మౌనంగా భరించిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి, ఎన్నో త్యాగాలు చేసి, తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్రజారాజ్యాన్ని స్థాపించారని అన్నారు.
ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుందని, అందరికీ న్యాయం జరుగుతుందని రేవంత్ తెలిపారు. ఈ ప్రమాణస్వీకార సమయానికే ప్రగతి భవన్ ముందు నిర్మించిన ఇనుప కంచెను నిర్మించడం జరిగిందని రేవంత్ వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ కుటుంబ సభ్యులైన ఎవరైనా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి సమస్యలు చెప్పుకోవచ్చని అన్నారు!
ఈ సందర్భంగా ఈ ప్రభుత్వంలోని వ్యక్తులు పాలకులు కాదు ప్రజలకు సేవకులు అని నిరూపించుకుంటామని రేవంత్ గట్టిగా చెప్పారు. ఇదే సమయంలో కార్యకర్తల కష్టాన్ని గుర్తుపెట్టుకుంటా అని రేవంత్ రెడ్డి తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ లో పూలే ప్రజాదర్భార్ నెలకొల్పుతామని అన్నారు. ఈ సందర్భంగా జై సోనియమ్మ అంటూ ప్రసంగాన్ని ముగించారు.