ఉద్యోగుల మేలుకు అదిరిపోయే చట్టం ఇది!

ఈ దిశగా ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు చట్టలు చేయగా వీటి కోవలో ఆస్ట్రేలియా కూడా చేరుతోంది.

Update: 2024-08-23 14:30 GMT

ఉద్యోగంలో పనివేళలు ముగిశాక ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసుకుంటే కుదురుతుందా?.. పనివేళలు ముగిశాక కూడా వ్యక్తిగత జీవితమనేది లేకుండా పనిచేసే కంపెనీ నుంచి ఫోన్లు, సహోద్యోగులతో పని విషయాలు మాట్లాడటం ఆపడం వీలవుతుందా?.. ఇలా అయితే చాలా బాగుంటుంది కదా. ఉద్యోగ వేళలు ముగిసి ఇంటికొచ్చేశాక కూడా ఏదో రూపంలో ఆఫీసు నుంచి ఫోన్లు వస్తే ఆ విసుగు, చిరాకు మామూలుగా ఉండవు. అందుకే పలు దేశాలు ఉద్యోగుల మేలు కోసం చట్టాలను తెస్తున్నాయి.

ఈ దిశగా ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు చట్టలు చేయగా వీటి కోవలో ఆస్ట్రేలియా కూడా చేరుతోంది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉద్యోగుల మేలు కోసం ఒక కొత్త చట్టాన్ని ఆగస్టు 26 నుంచి అందుబాటులోకి తేనుంది.

ఈ కొత్త చట్టం ప్రకారం.. ఉద్యోగులు ఎవరైనా తమ పనివేళలు ముగిశాక తమ మేనేజర్లు/ఇంచార్జులు/ఎండీలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉండదు. రైట్‌ టూ డిస్‌ కనెక్ట్‌ పేరుతో రానున్న చట్టం ప్రకారం పనిగంటలు పూర్తయ్యాక తమ యజమానులు/బాస్‌ లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

ఈ కొత్త ప్రకారం.. ఉద్యోగులు తమ పనివేళలు ముగిశాక వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించుకోవచ్చు. పనివేళలు ముగిశాక కూడా ఫోన్‌ కాల్స్‌ రూపంలో మాటలు, రేపటి పనులకు సంబంధించిన షెడ్యూళ్లు, నిన్న జరిగిపోయిన పనిలో తప్పుఒప్పుల గురించి క్లాసులు.. ఇలాంటివేమీ ఇక ఉండవు.

ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఫిబ్రవరిలోనే ఈ బిల్లును ఆమోదించింది. ఆస్ట్రేలియాలోని ఫెయిర్‌ వర్క్‌ యాక్ట్‌ లోని లోపాలను సరిదిద్దేందుకు ఈ సరికొత్త చట్టాన్ని తెచ్చారు. దీంతోపాటు కంపెనీల్లో వేతన అసమానతలు, తక్కువ వేతనాలు ఇవ్వడం వంటివాటిలోనూ ఈ చట్టం ఉద్యోగులకు మేలు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి,

మరోవైపు యధావిధిగా కంపెనీలు ఈ కొత్త చట్టంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టం ఏకపక్షంగా ఉందని అంటున్నారు. ప్రభుత్వ చర్య తొందరపాటుతో కూడుకున్నదని, అంతేకాకుండా లోపభూయిష్టమని అంటున్నాయి. ఈ చట్టంలో ఉన్న లోపాల వల్ల దీన్ని అమలు చేయడం సాధ్యం కాదని చెబుతున్నాయి.

మరోవైపు ఇప్పటికే రైట్‌ టూ డిస్‌ కనెక్ట్‌ చట్టాన్ని ఐరోపాలో పలు దేశాలు అమలు చేస్తున్నాయి. ఇప్పుడు వీటి కోవలో బ్రిటన్‌ కూడా చేరనుంది. అక్కడ కూడా ఉద్యోగుల సంరక్షణకు రైట్‌ టూ డిస్‌ కనెక్ట్‌ చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News