ట్రైన్ లో కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్.. నలుగురు మృతి
సాధారణంగా అగ్రరాజ్యంలో ఈ తరహా ఉదంతాల గురించి వింటుంటాం
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా అగ్రరాజ్యంలో ఈ తరహా ఉదంతాల గురించి వింటుంటాం. అలాంటి ఉదంతమే ఒకటి తాజాగా కదులుతున్న రైల్లో చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం (సోమవారం) ఐదు గంటల సమయంలో పాల్ఘర్ - ముంబయిల మధ్య జయపుర - ముంబయి సెంట్రల్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబరు 12956) ప్రయాణిస్తోంది. ఇందులోని ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జరిపిన విచక్షణ రహిత కాల్పుల్లో ఒక ఏఎస్ఐతో పాటు ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ షాకింగ్ ఉదంతానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
చేతన్ కుమార్ అనే సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తనకు సీనియర్ అయిన రామ్ మీనాను కదులుతున్న రైల్లో తన వద్ద ఉన్న ఆటోమేటిక్ గన్ తో కాల్పులు జరిపారు. ఆర్ఫీఎఫ్ లో ఏఎస్ఐగా పని చేస్తున్న అధికారిపై కాల్పులు జరిపిన చేతన్.. అనంతరం మరో బోగీలోకి వెళ్లాడు. అక్కడ మరో ముగ్గురు ప్రయాణికులపైనా కాల్పులు జరిపారు. దీంతో.. వారంతా అక్కడికక్కడే మరణించారు. దీంతో.. తోటి ప్రయాణికులు భయంతో వణికిపోయారు.
కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు దహిసర్ స్టేషన్ సమీపంలో రైలు కాస్త స్లో అయిన సమయంలో కిందకు దూకేశాడు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన స్పందించారు. ఆర్ఫీఎఫ్ అధికారుల సాయంతో నిందితుడ్ని మీరా రోడ్డు వద్ద పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసి బోరువాలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడు మానసిక ఒత్తిడికి గురైనట్లుగా చెబుతున్నారు.