పేదలకు ఎన్టీఆర్ చేశారు... చంద్రబాబు చేయలేదు కదా !?

అన్నగారు టీడీపీని స్థాపించిందే మూడు కీలక అంశాల మీద. అవే పార్టీకి పటిష్టమైన పునాదులను ఏర్పరచాయి.

Update: 2025-01-19 18:30 GMT

అన్నగారు టీడీపీని స్థాపించిందే మూడు కీలక అంశాల మీద. అవే పార్టీకి పటిష్టమైన పునాదులను ఏర్పరచాయి. పేదలకు కూడు గూడు, గుడ్డ అన్నది ఎన్టీఆర్ ఒక సిద్ధాంతం గా పెట్టుకున్నారు. ఎన్టీఆర్ లెఫ్టిస్టా లేక రైటిస్టా లేక న్యూట్రలా అన్నది అసలు చర్చకే అవసరం లేదు. ఆయన హ్యూమనిస్ట్ అన్నది తన పార్టీ ఫిలాసఫీ ద్వారా మూడు ముక్కలలో తెలియచేశారు. తాను పేదల పక్షపాతిని అన్నారు.

బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అందలాలు దక్కాలని కోరుకున్నారు. వారిని అలాగే ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్లారు. మహిళలకు సమాన వాటా ఇచ్చారు. ఆస్తి హక్కు కల్పించారు. పేదలకు పెద్ద పీట వేశారు. ప్రభుత్వాలు ఉన్న పేదల కోసమే అని చాటి చెప్పారు.

మొత్తానికి ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీకి ఏడున్నరేళ్ల పాటు పాలించారు. ఆయన పాలన మొత్తం పేదల కోసమే సాగింది. అందుకే ఈ రోజుకీ ఆయన గతించి 29 ఏళ్ళు గడచినా ఆయనను ప్రజలు గుర్తుంచుకుంటారు. గుండెల్లో పెట్టుకుంటారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి టీడీపీ అగ్ర నేతలు చెబుతూ ఆయన పేదలకు ఎంతో చేశారు అని కొనియాడారు. అదే విధంగా చాలా మంది నాయకులు కూడా ఇదే విషయం చెబుతూ ఎన్టీఆర్ అంటే పేదవారి అన్నం ముద్దగా అభివర్ణిస్తారు. మరి ఎన్టీఆర్ పేదలకు చేశారు అంటే చంద్రబాబు చేయలేదా అన్న ప్రశ్న ఆ వెంటనే వస్తుంది. అనేక మందిలో ఇదే క్వశ్చన్ కూడా ఉంటుంది.

అయితే అదే టీడీపీలో చంద్రబాబు గురించి పార్టీ నేతలు చెప్పాల్సి వస్తే విజనరీ అని తొలి పదంగా వాడుతారు. అంతే కాదు బాబు హైటెక్ సీఎం అంటారు. హైటెక్ సిటీని గుర్తుకు తెస్తారు. అంటే చంద్రబాబు గురించి మాట్లాడినపుడు పెద్ద పదాలనే వాడతారు కానీ పేదల గురించిన ప్రస్తావన ఎక్కడా ఉండదని కూడా గుర్తు చేసిన వారు ఉంటారు.

పేదలకు ఫలానా పని బాబు చేశారు అని అయితే ఎవరూ చెప్పరు, అసలు బాబు గురించి మాట్లాడినప్పుడు ఆ టాపిక్ నే ఎత్తుకోరు. ఇదంతా ఎందువల్ల. బాబు నిజంగా టీడీపీకి ఎక్కువ కాలం అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ పగ్గాలు గత మూడు దశాబ్దాలుగా అందుకుని ముందుకు సాగుతున్నారు. అంతే కాదు ఆయన ముఖ్యమంత్రిగా తెలుగు నాట అత్యధికాలం పాలించిన నేతగా ఉన్నారు. ఏపీకి నాలుగవ సారి సీఎం అయిన ఘనత కూడా చంద్రబాబుదే.

మరి టీడీపీ ఎన్నో సార్లు బాబు హయాంలో అధికారంలో ఉంది. అయినా కానీ బాబుని డైనమిక్ అంటారు, గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. కానీ ఆయన పేదలకు ఈ మంచి పని చేశారు అని గట్టిగా ఎందుకు చెప్పడంలేదు అన్నది ఒక చర్చగా వస్తోంది.

అదే సమయంలో చంద్రబాబు పేదల కోసం గుర్తుకు వచ్చే ఒక్క పధకాన్ని చేయలేదు అని అంటున్న వారూ ఉన్నారు. ఇదే విషయాన్ని రాజకీయ విమర్శలకు అయితే మరో విధంగా చెబుతారు. బాబు ఎపుడూ ముఖ్యమంత్రిగా కాకుండా సీఈవోగా వ్యవహరించారని ఆయన సంస్కరణలు అంటూ చాలా చేశారు కానీ పెదలకు అవి వ్యతిరేకంగానే ఉన్నాయని అంటూంటారు.

నిజానికి చూస్తే సంక్షేమ పథకాలు అన్నీ కూడా టీడీపీ ప్రారంభించినవే. వాటిని ఎన్టీఆర్ తన మదిలో నుంచి తీసుకుని వచ్చి అమలు చేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఆ స్పూర్తి ఉంది. కానీ ఆయన వారసుడిగా టీడీపీ పగ్గాలు అందుకున్న బాబు పేదల పక్షపాతిగా ఎందుకు మారలేకపోయారు అన్నది ఈ రోజుకీ ఒక బిగ్ డిబేట్ గానే ఉంటుంది అంటున్నారు.

ఇక దేశంలో చూస్తే గరీబీ హఠావో అంటూ శ్రీమతి ఇందిరాగాంధీ 1979 దశకంలో పేదల కోసం వారి సంక్షేమం కోసం అనేక పధకాలు తెచ్చారు. అయితే ప్రాంతీయ స్థాయిలో మాత్రం ఆ విధంగా చేసి అమలు చేసి చూపించింది ఒక్క ఎన్టీఆర్ అనే అంటారు. ఇంకా చెప్పాలీ అంటే ఇందిరమ్మ కంటే కూడా పదింతలు మెరుగ్గా ఎన్టీఆర్ పక్కా ఇళ్ల పధకం అయితేనేమి, పేదలకు కిలో రెండు రూపాయలు బియ్యం కానీ జనతా వస్త్రాలు కానీ అమలు చేసి చూపించారు.

ఎన్టీఆర్ 1994లో చివరిసారిగా అధికారంలోకి వచ్చినపుడు కూడా పేదల పక్షమే వహించారు. వారి కోసమే ఆయన అనేక సంక్షేమ పధకాలను ఆనాడు అమలు చేశారు. 1994 డిసెంబర్ లో అన్న గారు మూడోసారి సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తే కిలో రెండు రూపాయల బియ్యం పధకాన్ని 1995 సంక్రాంతికి అమలు చేసి తాను హామీల అమలు విషయంలో ఎక్కడా తగ్గేది లేదని నిరూపించుకున్నారు.

అలా పేదలు అంటే ఎంతో వల్లమాలిన ప్రేమతో చిత్త శుద్ధితో అన్న గారు అమలు చేశారు. అలా టీడీపీ కేరాఫ్ సంక్షేమం అన్న ముద్ర బలమైన బ్రాండ్ ఇమేజ్ ని ఆయన క్రియేట్ చేశారు. దానిని కంటిన్యూ చేయడంలో బాబు మాత్రం ఎందుకో తడబడ్డారు అని చెప్పారు.

ఆయన 1995లో అధికారంలోకి వచ్చాక కిలో బియ్యం అయిదుంపావలా చేసారు. అలాగే ఇతర పధకాలలో మార్పులు చేశారు. ఆయన సంస్కరణల మీద ఫోకస్ పెట్టారు. ఆయన దృష్టి కోణం వేరేగా ఉంటూ వచ్చింది. దాని వల్ల అభివృద్ధి బాగా జరిగినా సంక్షేమం విషయంలో మాత్రం ఎన్టీఆర్ ని బాబు మించలేకపోయారు అని ఇప్పటికీ అంతా అంటూంటారు.

ఇక బాబు ఏ మాత్రం అయినా సంక్షేమ పధకాలను గట్టిగా అమలు చేసింది ఉంటే అది 2014 నుంచి 2019 మధ్యలోనే. ఇక 2024 తరువాత సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన బాబు అందులో కొన్ని నెరవేర్చారు ఈసారి మాత్రం బాబు పేదల కోసం అని గట్టిగానే చెబుతున్నారు. ఏది ఏమైనా పేదల పక్షం టీడీపీ పూర్తి స్థాయిలో వహించినపుడే అన్న గారికి అసలైన నివాళీ అని అంతా అంటారు.

Tags:    

Similar News