పత్తికొండ పరేషాన్: అన్నీ అనుకున్నట్టు జరగట్లేదు ..!
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. వైసీపీ నాయకుల కు - టీడీపీ నాయకులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న నియోజకవర్గంలో వైసీపీ నేతల ను టీడీపీ వైపు మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలు.. యువ ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌బాబు కు.. సవాల్ గా మారాయి. అసలు నేతలను చేర్చుకోవడం ఎందుకు? అంటే.. స్థానికంగా ఉన్న అధికారాలు అన్నీ వైసీపీ నాయకుల చేతిలో ఉన్నాయి.
దీంతో ఏ పని చేయాలన్నా.. పత్తికొండ లో ముందుకు అడుగులు పడడం లేదు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి అనుకూలంగా ఉన్న అధికారులు ఇప్పటికీ.. ఆమె మాటే వింటున్నారన్నది శ్యామ్‌బాబు చెబుతు న్న మాట. వారిని ట్రాన్స్ ఫర్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నా.. ఓ కీలక మంత్రి ఇక్కడ చక్రం తిప్పుతు న్నారు. దీంతో ఆయన అనుకున్న విధంగా ఏదీ జరగడం లేదు. ప్రతిరోజూ.. ప్రజలకు అందుబాటులో ఉంటున్నా.. వారు కోరుతున్న పనులు కూడా చేయలేని పరిస్థితి వుంది.
కేఈ కృష్ణమూర్తి లెగసీ తో రాజకీయాల్లోకి వచ్చినా.. టీడీపీలో ఉన్న సీనియర్లు.. శ్యామ్‌బాబు కు సహకరించడం లేదన్న వాదన కూడా ఉంది. ఇక, అధికారులు తమ దారిలో తాము నడుస్తున్నారు. దీంతో శ్యామ్‌బాబు కు ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే వచ్చింది. ఇటీవల ఆయన పుట్టిన రోజును పురస్కరించు కుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు ఉన్న పళాన తొలగించారు. అదేమని అడిగితే.. సమాధానం కూడా చెప్పలేదు. నిజానికి ఎమ్మెల్యేలు ఉన్న చోట వారి మాటే చెల్లుబాటు కావాలి.
దీనికి భిన్నంగా పత్తికొండ రాజకీయాలు నడుస్తున్నాయి. తెరవెనుక ఉండి ఎవరో ఆడిస్తున్నారన్న వాదన అయితే శ్యామ్ బాబు వర్గంలో జోరుగానే వినిపిస్తోంది. నేరుగా ఆయనను ఢీ కొట్టే సాహసం చేయలేని కొందరు సీనియర్లు.. తెరవెనుక.. శ్యామ్‌బాబును డైల్యూట్ చేస్తున్నారన్న మాటలూ వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అధిష్టానం ముందు పెట్టి పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తున్నా.. ఆ ప్రయత్నాలు కూడా ముందుకు సాగడం లేదు. దీంతో పత్తి కొండలో ఆరు మాసాలైనా కూడా.. శ్యామ్‌బాబుకు పట్టు చిక్కలేదన్న కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం.