మౌనం కూడా రాజ‌కీయ‌మే.. ప‌వ‌న్ గురించి కొత్త విష‌యాలు..!

ఢిల్లీలో ధర్నా కూడా చేసింది. మరి ఇంత జరిగినా కూడా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం అసలు రాష్ట్రంలో ఏమీ జరగలేదన్నట్టుగా ఆయన భావిస్తున్నారా? అనేది ప్ర‌శ్న‌.

Update: 2024-08-06 16:56 GMT

రాజకీయాల్లో మౌనం సమాధానం కాదు. అనేక సమస్యలు చుట్టుముట్టినప్పుడు సహజంగా నాయకులు స్పందిస్తారు. తమ వైఖరి ఏంటో చెబుతారు. తమ ఉద్దేశాలను కూడా ప్రజలకు వెల్లడిస్తారు. ఇది రాజకీ య నాయకులకు ఉన్న ప్రధాన‌ లక్షణం. ఉదాహరణకు ప్రభుత్వంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని విషయాల్లో వెంటనే స్పందిస్తున్నారు. ఇటీవ‌ల బాపట్లలో టిడిపి కార్యకర్త పోలీసు కాలర్ పట్టుకున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. చంద్రబాబు మౌనంగా కూర్చోలేదు వెంటనే స్పందించారు.

వాస్తవం ఏంటి, జరుగుతున్న ప్రచారం ఏంటి అనే దానిపై ఆయన వీడియోతో సహా ప్రజల ముందు ఉంచారు. నిజానికి ప్రభుత్వంలో ఉన్న పార్టీగా స్పందించక పోయిన ఎవరూ ఏమీ అడగరు. కానీ అది పార్టీపై మచ్చ పడుతుందని భావించినప్పుడు లేదా వ్యక్తిగతంగా తన ఇమేజ్‌కు భంగం కలుగుతుందని భావించినప్పుడు చంద్రబాబు అనేక సందర్భాల్లో స్పందించారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా అదే పని చేస్తున్నారు. మరి ఇలాంటి విషయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తీసుకున్నప్పుడు ఆయన మౌనంగా ఉంటున్నారు. ఎక్కడా స్పందించడం లేదు.

ఇటీవల కాలంలో రెండు ముఖ్యమైన విషయాలు తెరమీదకి వచ్చాయి. ఈ రెండు విషయాలు కూడా పార్టీ పరంగా అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా పవన్ పై విమర్శలు వచ్చేందుకు అవకాశం కల్పించాయి. వాస్తవానికి ఆ రెండు సమస్యలు తెర‌ మీదకు వచ్చినప్పుడు పవన్ వ్యక్తిగతంగా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ స్పందిస్తారని ఆ పార్టీ నాయకులు భావించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. చాలా వ్యూహాత్మకంగా మౌనం పాటించారు. దీంతో అసలైన ఉద్దేశం ఏంటి అనేది రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ చర్చగా మారింది.

ఇక ఆ విషయాలను పరిశీలిస్తే.. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాల్లో తరచుగా రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు యువతులు అదృశ్యం అయ్యారని దీనికి కారణం వాలంటీర్లేనని ఆయన చెప్పుకొచ్చారు. వైసిపి ప్రభుత్వం స్ప‌దించలేదని అందుకే ఇంతమంది ఆడబిడ్డలు నానా కష్టాలు పడ్డార‌ని తెలిపారు. వారు ఎక్క‌డ ఉన్నారో కూడా తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ఆయన పెద్ద ఎత్తున ప్రచారంలో చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా స్పష్టత ఇచ్చింది.

రాష్ట్రం నుంచి 2019 - 2023 మధ్యకాలంలో 44 వేల మందికి పైగా మహిళలు అదృశ్య‌మయ్యారని, వీరిలో 44 వేల మంది మహిళలు వెనక్కి వచ్చారని కేవలం 635 మంది మాత్రమే రావాల్సి ఉందని లెక్కలతో సహా వివరించింది. ఏ ఏ సంవత్సరంలో ఎంత మంది మహిళలు అదృశ్య‌మయ్యారు? ఎంతమందిని వైసిపి ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది? దీనికి గాను అనుసరించిన వ్యూహం దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసులు వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇంత జరిగిన తర్వాత పవన్ స్పందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన స్పందించలేదు.

ఇక రెండో విషయం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ వివాదాలు, హత్యలు, దాడులు వంటి అంశాలు. నిజానికి ఇది ఎవరు చేస్తున్నారు అనేది పక్కన పెడితే, కూటమి ప్రభుత్వంలో బాధ్యుడిగా పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం అయితే ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఎలా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఎలాంటి రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు పాల్పడబోమని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

కానీ జరుగుతున్నవన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత హత్యలేనని ప్రతిపక్ష వైసిపి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. ఢిల్లీలో ధర్నా కూడా చేసింది. మరి ఇంత జరిగినా కూడా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం అసలు రాష్ట్రంలో ఏమీ జరగలేదన్నట్టుగా ఆయన భావిస్తున్నారా? అనేది ప్ర‌శ్న‌. లేక ఎందుకు స్పందించాలి అని అనుకుంటున్నారా అనేది చ‌ర్చ‌. ఈ పరిణామాలతో పవన్ వ్యవహరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మౌనం మంచిదే అయినా..అన్ని స‌మ‌యాల్లోనూ కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News