వైసీపీకి ప్రతిపక్ష హోదా..సోమిరెడ్డి సలహా
ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
రాజన్న వచ్చినాడు..పెళ్లి కొడుకు వచ్చినాడు...ఒక్కసారి ఇలా వచ్చి పోమ్మా మెరుపు తీగ....సింహరాశి సినిమాలోని ఈ పాపులర్ డైలాగ్ ఈ రోజు మీమ్స్ లో ట్రెండ్ అవుతోంది. ఈ రోజు మీమర్లకు సరిపడా స్టఫ్ ను పులివెందుల ఎమ్మల్యే జగన్ ఇచ్చి వెళ్లారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు జగన్ సభకు వస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి భారీ ఎలివేషన్ ఇచ్చారు. కట్ చేస్తే..11 మంది సభ్యులతో సభకు వచ్చిన జగన్ పట్టుమని 11 నిమిషాలు కూడా లేకుండా వాకౌట్ చేసి మెరుపు తీగలా వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
కేవలం అనర్హత వేటు పడుతుందేమో అన్న భయంతో జగన్ అసెంబ్లీకి వచ్చారని సోమిరెడ్డి ఆరోపించారు. అయితే, జగన్ ఈ ఒక్కరోజే వచ్చి డుమ్మా కొడతారా లేక ఈ బడ్జెట్ సెషన్ జరిగినన్ని రోజులు వస్తారా అన్నది తేలాల్సి ఉందని చురకలంటించారు. ప్రతిపక్ష హోదా దక్కని పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ కోసం ఏమైనా ప్రత్యేక చట్టం తీసుకురావాలా అని ప్రశ్నించారు.
అయినా, జగన్‌కు మోడీ కాళ్ల మీద పడే అలవాటు ఉందని, ఆ అలవాటుతోనే ఆయన కాళ్ళ మీద పడి అసెంబ్లీలోకి వెళ్లేందుకు, ప్రతిపక్ష హోదా పొందేందుకు చట్టంలో మార్పు చేసి తెచ్చుకో అంటూ సోమిరెడ్డి చురకలంటించారు. వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలు బయటకు రాకుండా ఉండేందుకే జగన్ అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారని ఆరోపించారు.
ఇక, 40 శాతం ఓటింగ్ ఉన్న తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే చంద్ర శేఖర్ డిమాండ్ చేయడంపై కూడా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అసెంబ్లీలో సభ్యుల సంఖ్యను బట్టి ప్రతిపక్ష హోదా వస్తుందన్న విషయం తెలియని ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న రీతిలో...ప్రజలు, చట్టం, రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కావాలని జగన్ డిమాండ్ చేస్తుంటే...ఆ పార్టీ ఎమ్మెల్యేలు అడగడంలో తప్పు లేదని విమర్శిస్తున్నారు.
అసెంబ్లీకి 60 రోజులు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. రఘురామ ఇచ్చిన వార్నింగ్ వల్లే జగన్ ఈ రోజు వచ్చి హాజరు వేసి పోయారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. మరో 60 రోజుల పాటు జగన్ అసెంబ్లీ వైపు చూడరని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ ఒక్క రోజు..అది కూడా గవర్నర్ ప్రసంగం నాడు హాజరైతే...రఘురామ స్పీకర్ గా ఉన్నప్పుడు సభకు డుమ్మా కొట్టొచ్చని, ఆయనను అధ్యక్షా అని పిలవాల్సిన అవసరం ఉండదని జగన్ అనుకొని ఉంటారని రకరకాలుగా నెటిజన్లు మీమ్స్ పెడుతున్నారు.