హైదరాబాద్ లో “సన్ బర్న్” ఈవెంట్ ... లేటెస్ట్ అప్ డేట్ ఇదే!
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో "సన్ బర్న్" పేరుతో నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన ఈవెంట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో "సన్ బర్న్" పేరుతో నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన ఈవెంట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ ను ఈసారి మాదాపూర్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో ఈ ఈవెంట్ పై తెలంగాణ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలొచ్చిన నేపథ్యంలో... తాజాగా ఈ ఈవెంట్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చింది.
అవును... అత్యంత వివాదాస్పద ఈవెంట్ గా చెప్పుకునే "సన్ బర్న్" కార్యక్రమాన్ని ఈసారి మాదాపూర్ లో నిర్వహిస్తున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చక చకా జరుగుతున్నాయని నిన్నటివరకూ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అనుమతి లేకుండానే ఆన్ లైన్ వేదికగా టిక్కెట్లు అమ్మకానికి పెట్టేశారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది!
ఈ నేపథ్యంలో... మదాపూర్ లో నిర్వహించ తలపెట్టిన సన్ బర్న్ కార్యక్రమాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. ఇదే సమయంలో ఈ ఈవెంట్ కు సంబంధించి బుక్ మై షోలో టికెట్ల విక్రయాన్ని నిలిపివేశారు. మరోపక్క ఈ ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్ పై పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తుంది. అనుమతి తీసుకోకుండా టిక్కెట్లు విక్రయించడమే ఇందుకు కారణం అని తెలుస్తుంది.
మరోపక్క అనుమతి తీసుకోకుండా టికెట్లు అమ్మినందుకు బుక్ మై షో, నోడల్ అధికారులకు కూడా హైదరాబాద్ పోలీసులు నోటీసులిచ్చారు. దీంతో బుక్ మై షోలో "సన్ బర్న్ షో హైదరాబాద్" ఈవెంట్ ఆప్షన్ అదృశ్యమైంది! అయితే ఏపీలో విశాఖ వేదికగా జరగబోయే సన్ బర్న్ ఈవెంట్ టికెట్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి.
కాగా... సన్ బర్న్ అనే భారీ మ్యూజిక్ ఫెస్టివల్ దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈవెంట్లు నిర్వహిస్తుంటున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ వేడుకలో అన్ లిమిటెడ్ గా మద్యం అనుమతి ఉంటుందని చెప్పడంతో... ఇదే అదనుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని ఆరోపణలున్నాయి. దీంతో తాజాగా ఈ విషయంపై రేవంత్ రెడ్డి.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి!
ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకుని గట్టిగా మందలించారని.. అందువల్లే ఈవెంట్ నిర్వహణపై వెనక్కి తగ్గారని తెలుస్తోంది.