అంతరిక్షం నుంచి భారత్ అందాలు... సునీత ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా... అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించింది అనే ప్రశ్నకు సునీత స్పందించారు.;

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లు సుమారు 9 నెలల అనంతరం మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.) నుంచి భూమిపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు అదే నౌకలో వచ్చారు. ఈ క్రమంలో 12 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు.
అవును... ఐ.ఎస్.ఎస్. నుంచి భూమిపైకి వచ్చిన వ్యోమగాములను నాసా సిబ్బంది హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించగా.. 12 రోజుల అనంతరం తొలిసారి వారు బాహ్య ప్రపంచం ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సునీతా, బుచ్ విల్మోర్, నిక్ హేగ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా... అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించింది అనే ప్రశ్నకు సునీత స్పందించారు. స్పేస్ నుంచి భారత్ ఎలా కనిపించింది, హిమాలయాల అందాలను వివరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా... స్పేస్ నుంచి భారత్ చాలా అద్భుతంగా ఉందని.. తాము హిమాలయాల మీద నుంచి వెళ్లిన ప్రతీసారీ.. ఆ అందాలను బుచ్ విల్మోర్ కెమెరాలో బంధించారని ఆమె తెలిపారు.
ఇక.. తూర్పు వైపు నుంచి ముంబై, గుజరాత్ వంటి ప్రాంతాల మీదుగా వెళ్తున్నప్పుడు.. తీరం వెంబడి ఉండే మత్స్యకారుల పడవలు తమకు సిగ్నల్ లాగా పనిచేసేవని.. మొత్తంగా భారత్.. పెద్ద నగరాల నుంచి లైట్ల నెట్ వర్క్ చిన్న నగరాల మీదుగా వెళ్తున్నట్లు కనిపించిందని.. ఇక హిమాలయాలైతే అత్యుద్భుతమని వివరించారు.
ఇదే సమయంలో.. భారత్ కు వచ్చే అవకాశాల గురించి ఆమె ప్రస్థావించారు. ఇందులో భాగంగా... తన తండ్రి పుట్టిన దేశానికి త్వరలోనే వెళ్లాలని అనుకుంటున్నానని.. అక్కడి బంధువులు, ప్రజలతో ముచ్చటించాలని, స్పేస్ లోని తన అనుభవాలను వారందరితోనూ పంచుకోవాలని ఉందని సునీత చెప్పుకొచ్చారు.
అదే విధంగా... భారతదేశం అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమని.. అంతరిక్ష యాత్రల్లో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న గొప్ప దేశమని కొనియాడారు. అలాంటి మూలాలు తనలోనూ ఉండటం గర్వంగా ఉందని సునీతా విలియమ్స్ వివరించారు.
కాగా... భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపాక్ పాండ్యా, స్లోవిన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు 1965 సెప్టెంబర్ 19న ఒహోయోలో సునీత విలియమ్స్ జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ లో జన్మించి.. 1958లోనే అమెరికాకు వలస వెళ్లారు.
ఇక.. ఇదే మీడియా సమావేశంలో పాల్గొన్న బుచ్ విల్మోర్ మాట్లాడుతూ.. మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక్కతాటిపైకి తెస్తుందని అన్నారు. ప్రధానంగా స్టార్ లైనర్ లో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి నాసా, బోయింగ్ టీమ్స్ ఎంతో కృషిచేశాయని కొనియాడారు.