వైసీపీకి గుంటూరు కారం!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. గత వారం జరిగిన పది కార్పొరేషన్, మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయ పతాకం ఎగురవేయగా, అదే జోష్ లో గుంటూరు కార్పొరేషన్ పై దండయాత్ర మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. దీంతో వైసీపీ ఆధీనంలో ఉన్న గుంటూరు మేయర్ పోస్టు చేజారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత కొన్ని నెలలుగా గుంటూరు నగర రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. మేయర్ వర్సెస్ కమిషనర్ అన్నట్లు ఆధిపత్య పోరు నడిచింది. మేయర్ కు ప్రభుత్వం అండ లేకపోవడంతో ఆయన అధికారం సాగటం లేదని చెబుతున్నారు. దీంతో కమిషనర్ ను టార్గెట్ చేసి తన పనులు చేయించుకోవాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు పావులు కదిపారని అంటున్నారు. అయితే అధికార బలం లేకపోవడంతో మేయర్ మనోహర్ నాయుడు మాటలకు విలువ ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మెజార్టీ కార్పొరేటర్లు పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ఫలితంగా తాజాగా జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆరుగురు సభ్యులను టీడీపీ గెలుచుకుంది.
గుంటూరు కార్పొరేషన్ లో మొత్తం 56 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో 34 మంది టీడీపీ కూటమి జైకొట్టడంతో మేయర్ కావటి మనోహర్ నాయుడికి పదవీ గండం పొంచి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మార్చి 17తో పాలకవర్గం ఏర్పడి నాలుగేళ్లు పూర్తవుతుంది. అయితే నాలుగేళ్ల వరకు మేయర్ పై అవిశ్వాసం పెట్టే వీలు లేకపోవడం వల్ల మరో నెల రోజులు వేచిచూడాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మార్చి 18న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
ఇక అవిశ్వాసానికి ముందే టీడీపీ మేయర్ అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. ప్రస్తుతం టీడీపీ ఫ్లోర్ లీడరుగా వ్యవహరిస్తున్న కోవెలమూడి రవీంద్రను మేయర్ గా ప్రతిపాదిస్తున్నారు. ఆయన ప్రస్తుతం 37వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు. మంత్రి నారా లోకేశ్ ఆదేశాల ప్రకారం ఇటీవల పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో కొత్త మేయరుగా కోవెలమూడి రవీంద్రను పార్టీ ప్రతిపాదిస్తున్న విషయం వెల్లడించారు. దీనికి అంతా ఓకే అన్నారని చెబుతున్నారు. దీంతో మరో నెల రోజుల్లో వైసీపీ ఆధీనంలో ఉన్న మేయర్ పదవి కూటమి హస్తగతమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.