పదవుల పందేరంలో వైసీపీ జంపింగ్స్ షాక్ !
ఈ విషయంలో కొన్ని నిబంధనలు పెట్టుకుని చాలా జాగ్రత్తగా పదవులు ఇస్తున్నారు.;

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికి మూడు విడతలుగా పదవులు పందేరం చేసింది. నామినేటెడ్ పదవులు కీలక నాయకులకు ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికే ఇస్తున్నారు. ఈ విషయంలో కొన్ని నిబంధనలు పెట్టుకుని చాలా జాగ్రత్తగా పదవులు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవలే 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ పదవులు పాలక మండళ్లూ ప్రకటించింది. అందులో జనసేనకు బీజేపీకి చాన్స్ ఇచ్చారు. ఇపుడు ఇంకో విడత పదవులకు రంగం సిద్ధం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వాలని సిఫార్సు చేయవద్దు అని స్పష్టంగా చెప్పేస్తున్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీలో ఉండి ఇపుడు జంప్ చేసి వచ్చిన వారికే మళ్ళీ అవకాశాలు ఇస్తే పార్టీలో ఆది నుంచి ఉన్న వారు డీమోరలైజ్ అవుతారని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అదే విషయం పార్టీ నేతలకు చెబుతుంది.
ఇలా వచ్చి అలా పదవులు కావాలంటే కుదరదని చెబుతోంది. పార్టీ కోసం పూర్తి కాలం పనిచేసేవారికే తొలి ప్రాధాన్యత అని అంటోంది. ఈ నేపధ్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన వారికి షాక్ తగిలినట్లు అయింది. అధికార పార్టీలో చేరి పదవులు ఈజీగా దక్కించుకోవాలనుకునే వారికి ఈ నిర్ణయం ఇబ్బందికరమే అని అంటున్నారు. దాంతో మాజీ ఫ్యాన్ పార్టీ నేతలు అంతా టీడీపీలో తాము కష్టపడి పనిచేయడమే కాకుండా తమ పనితీరుని మరింత కాలం నిరూపించుకోవాల్సి ఉందని అంటున్నారు.
ఇక టీడీపీలోనే ఉంటూ ఇతర పార్టీలతో రాసుకుని పూసుకుని తిరిగేవారికి అసలు పట్టించుకోవద్దని వారి విషయం కూడా పక్కన పెట్టాల్సిందే అని అధినాయకత్వం హుకుం జారీ చేసింది అని ప్రచారం సాగుతోంది. అంటే వీరంతా అవకాశవాదం ధోరణితో వెళ్తున్నారని వారికి ఈ విధంగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని అంటున్నారు.
ఇలా కనుక కసరత్తు చేసి ఎక్కడికక్కడ మధింపు చేసుకుని పార్టీ కోసం ఏళ్ళకు ఏళ్ళు కష్టపడుతున్నా తగిన గుర్తింపు రాని వారికే పదవులు అని అంటున్నారు. అలాంటి వారికే అందలాలు ఇస్తామని వారిని చూసి మిగిలిన వారు స్పూర్తి పొందాలని అధినాయకత్వం భావిస్తోందిట. పార్టీ కోసం పనిచేస్తేనే పదవులు వస్తాయని ఇటీవల జరిగిన టీడీపీ ఆవిర్భావ సభలో చంద్రబాబు స్వయంగా చెప్పారు.
పదవులు కోసం నాయకుల చుట్టూ తిరిగితే ప్రయోజనం లేదని కూడా స్పష్టం చేశారు. ఇంకో వైపు చూస్తే ఈసారి ఏపీలో ఉన్న వందలాది దేవాలయాలకు పాలక మండళ్ళను నియమిస్తారని అంటున్నారు. అందులో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. అలాగే కీలకమైన దేవాలయాలు ఉన్నాయి. వాటికి చైర్మన్లు సహా పాలక మండళ్ళను నియమిస్తారు అని అంటున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కార్పోరేషన్ల చైర్మన్లు పాలక మండళ్ళ పోస్టులు కూడా నామినేటెడ్ విధానంలో భర్తీ చేస్తారని అంటున్నారు.
బీజేపీ జనసేన పార్టీలు ఇప్పటికే తమ పార్టీల నుంచి ఆశావహుల జాబితా లిస్ట్ ని టీడీపీ పెద్దలకు అందచేశారని అంటున్నారు. టీడీపీ కూడా పూర్తి కసరత్తు చేసి తమ పార్టీ వారిని ఎంపిక చేస్తే తొందరలోనే నామినేటెడ్ పదవుల పందేరానికి రంగం సిద్ధం అవుతుందని అంటున్నారు.