ఆ హీరోకు చంద్రబాబు ఇచ్చే కీలక పదవి ఇదేనా?
ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక పదవిని ఇవ్వొచ్చని ప్రచారం సాగుతోంది
మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనికా రెడ్డి, ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ జంట టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక పదవిని ఇవ్వొచ్చని ప్రచారం సాగుతోంది. మంచు మనోజ్ ను వచ్చే ఎన్నికలకు టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమచారం. ఈ క్రమంలో మనోజ్ ను టీడీపీ ప్రచార విభాగం చైర్మన్ గా నియమించవచ్చని టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం వైసీపీతో పోలిస్తే టీడీపీలో పెద్దగా నటులు లేరు. వైసీపీలో అలీ, పోసాని కృష్ణమురళి, జోగి నాయుడు, విజయచందర్ తదితరులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే సినీ నటుల అవసరం కావాల్సి ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ కు టీడీపీ ప్రచార విభాగం చైర్మన్ పదవిని ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మౌనికకు, తనకు ప్రజా సేవ అంటే ఆసక్తి ఉందని మంచు మనోజ్ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ అంశమే తమను కలిపిందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం తమిద్దరికీ ఉందన్నారు. తమ ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటేనన్నారు. మౌనికకు రాజకీయాలపైన ఆసక్తి ఉంటే తాను సపోర్ట్‌గా నిలబడతానని వెల్లడించారు.
కాగా మనోజ్ భార్య భూమా మౌనికా రెడ్డి ఇప్పటివరకు తన అక్క భూమా అఖిల ప్రియ తరఫున నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రచారం చేయడం, బహిరంగ సభల్లో మాట్లాడటం చేశారు. మీడియాకు సైతం పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో భూమా అఖిలప్రియకు టీడీపీ సీటు ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. ఇప్పటికే అఖిల అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా భూమా మౌనిక టీడీపీ సీటు తనకు ఇవ్వాలని కోరే అవకాశం ఉందని అంటున్నారు.
ఒకవేళ ఆళ్లగడ్డ సీటు తన అక్క భూమా అఖిలప్రియకు టీడీపీ కేటాయిస్తే మౌనికా రెడ్డి నంద్యాల నుంచి అసెంబ్లీకి పోటీ చేసే చాన్సు ఉందని చెబుతున్నారు. గతంలో ఇలాగే మౌనిక తల్లిదండ్రులు నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి నంద్యాల, ఆళ్లగడ్డల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
2014లోనూ భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నాగిరెడ్డి కన్నుమూశాక ఆయన అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మౌనిక కూడా తన తల్లిదండ్రులు, అక్క బాటలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు.
అలాగే భూమా మౌనిక దృష్టి చిత్తూరు జిల్లా చంద్రగిరిపైనా ఉందని టాక్ నడుస్తోంది. మనోజ్ కుటుంబానికి చెందిన శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థలు చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రంగంపేటలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూమా మౌనికను చంద్రగిరి నుంచి పోటీ చేయించడానికి మనోజ్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని అంటున్నారు.
ప్రస్తుతం చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు. ఈసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన తనయుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ ఇంచార్జిగా పులివర్తి నాని ఉన్నారు. అయితే పులివర్తి నాని కంటే భూమా మౌనికనే గట్టి పోటీ ఇవ్వగలరని భావిస్తున్నారు. మోహన్ బాబు కోడలుగా, భూమా నాగిరెడ్డి కూతురిగా మౌనికకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేరు, చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్న తమ విద్యా సంస్థల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తమకు అండగా ఉంటారని మనోజ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.