చంద్రబాబు అరెస్టు.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏదీ: టీడీపీ నేతల క్వశ్చన్
అయితే, దీనికి విరుద్ధంగా అరెస్టు చేశాక తగిన పత్రాలు ఇస్తామని పోలీసులు చెప్పడంతో టీడీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన నేపథ్యంలో ఏపీ సీఐడీ పోలీసులు అనుసరిస్తున్న విధానా లపై టీడీపీ నేతలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండా ఎలాంటి ఆధారాలతో ఆయనను అరెస్టు చేశారనేది ప్రధాన ప్రశ్న. ఎఫ్ ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని బాబు తరఫు న్యాయవాదులు తెలిపారు. ఎఫ్ ఐఆర్‌లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? అని నిలదీశారు.
అరెస్టుకు ముందు ఆ పత్రాలు ఇవ్వాలని చంద్రబాబు తరఫున న్యాయవాదులు డిమాండ్ చేశారు. అయితే, దీనికి విరుద్ధంగా అరెస్టు చేశాక తగిన పత్రాలు ఇస్తామని పోలీసులు చెప్పడంతో టీడీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అయితే, దేని గురించి అరెస్టు చేస్తారనే అడిగే హక్కు సామాన్యులకు కూడా ఉందని టీడీపీ నాయకులు పోలీసులను ప్రశ్నించారు. అరెస్టు నోటీసులు ఇచ్చామని పోలీసులు తేల్చి చెప్పారు.
డీకే బసు కేసు ప్రకారం వ్యవహరించామని పోలీసులు వెల్లడించారు. 24 గంటల్లో అరెస్టుకు కారణాలతో కూడిన పత్రాలు ఇస్తామని తెలిపారు. అవగాహన లేకుండా న్యాయవాదులు వ్యవహరిస్తున్నారంటూ పోలీసులు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ను అరెస్టు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, శ్రేణులు ఆందోళనకు దిగారు.