2019 ఫార్ములా.. టీడీపీకి కలిసి వచ్చేనా?!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అనుసరిస్తున్న వ్యూహాన్ని పరిశీలిస్తే.. 2019 ఎన్నికల సమయంలో అనుసరిం చిన ఫార్ములానే కనిపిస్తోంది
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అనుసరిస్తున్న వ్యూహాన్ని పరిశీలిస్తే.. 2019 ఎన్నికల సమయంలో అనుసరించిన ఫార్ములానే కనిపిస్తోంది. మరి ఇది 2024 ఎన్నికలకు ఏమేరకు కలిసి వస్తుందనేది ఆసక్తికర చర్చగా మారింది. 2019 ఎన్నికల విషయాన్ని పరిశీలిస్తే.. అప్పట్లో చంద్రబాబు సింగిల్ మ్యాన్ ఆర్మీ మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా కలియదిరిగారు. అధికారంలో ఉన్నప్పటికీ.. ఆయన తనను నమ్మాలని, తనను చూసి ఓటేయాల ని ప్రజలకు విన్నవించారు.
అంతేకాదు. తమ్ముళ్లు తప్పు చేసినా తనను చూసి ఓటేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే, ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాల్లోనే విజయం దక్కించుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు 2024 ఎన్నికల కు సంబంధించి చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని నిశితంగా గమనిస్తే.. 2019 ధోరణే కనిపిస్తోందని అంటు న్నా రు పరిశీలకులు. చంద్రబాబు సింగిల్ మ్యాన్ ఆర్మీ మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా కలియ దిరుగుతున్నా రు. తనను చూసి ఓటేయాలని కొన్ని సందర్బాల్లో ఆయన పిలుపు నిస్తున్నారు.
అయితే, 2019కి ఇప్పటికి కొంత మార్పు ఏంటంటే.. ఇప్పుడు నారా లోకేష్ కూడా పాదయాత్ర చేస్తున్నారు. అంటే.. మొత్తంగా ఇటు తండ్రి, అటు కుమారుడు పార్టీని గెలిపించేందుకు అహర్నిశలు కష్టిస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవం. కానీ, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఇమేజ్ కానీ, ఇటు నారా లోకేష్ ఇమేజ్ కానీ.. పనిచేయకపోతే.. పరిస్థితి ఏంటి? అనేది మాత్రం ఆలోచన చేస్తున్నట్టు కనిపించడం లేదు. క్షేత్రస్థా యిలో పరిస్థితిని గమనిస్తే.. ప్రజల మూడ్ స్థానిక నేతలను బట్టి ఉంటోంది.
నియోజకవర్గం స్థాయిలో నాయకులు ప్రజలకు చేరువ కాకపోతే.. ఇబ్బందులు తప్పవు. అధిష్టానం ఎంత నీతిమంతంగా , ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరు, వారు ప్రజలతో మమేకం అయ్యే విధానం వంటివి అత్యంత కీలకం. ఈ విషయంలో టీడీపీ ఎక్కడో తప్పటడగులు వేస్తు న్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. నాయకులు నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. మీడియా ముందు మాటలకే పరిమితం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితి మార్చి.. పార్టీ పరంగా నాయకుల ను ముందుండి నడిపిస్తేనే విజయం సాధ్యమవుతుందని చెబుతున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.