సుప్రీంకోర్టును కన్ఫ్యూజ్ చేసి విడాకుల కేసు!
ఒక విడాకుల కేసు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టునే కన్ప్యూజ్ నకు గురి చేసింది.
ఒక విడాకుల కేసు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టునే కన్ప్యూజ్ నకు గురి చేసింది. ఈ కేసుకు సంబంధించి చోటు చేసుకున్న ప్రొసీడింగ్స్ విషయంలో కింది కోర్టులతో సహా వివిధ స్థాయిల్లో నెలకొన్న నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయటమే కాదు.. కింది కోర్టు ఇచ్చిన విడాకుల జారీ ఉత్తర్వులపై స్టే విధించారు. ఈ సందర్భంగా ఈ కేసు విషయంలో చోటు చేసుకున్న విస్మయకర అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకూ అసలేం జరిగిందంటే..
పానుగంటి శ్రీనివాసరావు వర్సెస్ ప్రత్యూషల పేరుతో రంగారెడ్డి జిల్లా.. ఎల్బీనగర్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు నమోదైంది. అయితే.. ఈ కేసును శ్రీకాకుళం ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేయాలని ప్రత్యూష సుప్రీంలో కేసు దాఖలు చేశారు. ఈ కేసును 2023 ఏప్రిల్ 28న సుప్రీంకోర్టు జడ్జి తొలుత విచారించారు. రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టులో ఉన్న కేసు విచారణ ప్రక్రియపై స్టే విధిస్తూ ప్రతివాదికి నోటీసులు జారీ చేశారు.
ఇక్కడి వరకు సజావుగా జరిగినా.. ఇక్కడే అసలు గందరగోళం మొదలైంది. ప్రతివాదికి పంపిన నోటీసులు అందకపోవటంతో సుప్రీంకోర్టులో కేసు విచారణ వాయిదాలు పడుతూ పోయింది. కట్ చేస్తే.. ఈ నెల 26న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఈ కేసును విచారించినప్పుడు.. గతంలో ఎన్నోసార్లు విచారణకు వచ్చినప్పటికి ఈ కేసులో ఒకే ఒక్క ఆఫీసు రిపోర్టు రికార్డుల్లో ఉండటంపై ఆయన సందేహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలపై ఆరా తీయగా.. కొత్త విషయం వెలుగు చూసింది.
ఈ కేసును శ్రీకాకుళం కోర్టుకు బదిలీ చేస్తున్నట్లుగా పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి 2023 జులై 18, అక్టోబరు 12 తేదీల్లో రాసిన లేఖలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ముందుకు వచ్చాయి. ఈ లేఖల్ని రిజిస్ట్రీకి వచ్చినా అక్కడి అధికారులు పట్టించుకోలేదు. దీనిపై రిపోర్టు ఇవ్వాలంటూ న్యాయమూర్తి అసిస్టెంట్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఈ కేసును చూసే అసిస్టెంట్ సరిగా పని చేయకపోవటంతో రిపోర్టు ఇవ్వలేకపోతుననట్లుగా పేర్కొన్నారు.
మరోవైపు ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుఇచ్చిన స్టే విషయాన్ని అర్థం చేసుకోకుండా రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి కేసును శ్రీకాకుళానికి బదిలీ చేశారు. దీంతో అక్కడి న్యాయమూర్తి ఈ కేసును విచారించిఈ ఏడాది మర్చి 10న ఎక్స్ పార్టీ డిక్రీ పాస్ చేసింది. ఈ నేపథ్యంలో వాదప్రతివాదుల వివాహ బంధం రద్దైంది. ఈ విషయాల్ని గుర్తించిన సుప్రీంకోర్టు ఆశ్చర్యానికి గురైంది.
దీంతో స్పందించిన సుప్రీంన్యాయమూర్తి.. శ్రీకాకుళం ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించారు. తదుపరి విచారణను డిసెంబరు 10కు వాయిదా వేశారు. ఆ రోజు ప్రతివాది తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని జస్టిస్ సందీప్ మెహతా ఆదేశించారు. అంతేకాదు.. ఈ ఉత్తర్వుల కాపీని రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టు రిజిస్ట్రార్ జనరళ్లకు పంపి.. అక్కడి ప్రధాన న్యాయమూర్తుల ముందు ఉంచాలని పేర్కొన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని పట్టించుకోకుండా.. కింది కోర్టులు వ్యవహరించిన తీరు.. తాజా ఉదంతంతో వెలుగు చూసి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.