కర్నూలులో హైకోర్టు బెంచ్ : న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

రాయలసీమ వాసుల చిరకాల వాంఛ కర్నూలులో హైకోర్టు బెంచ్ పై ఉన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Update: 2025-02-20 10:30 GMT

రాయలసీమ వాసుల చిరకాల వాంఛ కర్నూలులో హైకోర్టు బెంచ్ పై ఉన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాయలసీమ ప్రాంత వెనుకబాటును పరిగణించి, ఆ ప్రాంత పురోగతికి కర్నూలు నగరంలో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. అయితే ప్రభుత్వం రాసిన లేఖపై తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని హైకోర్టు వ్యాఖ్యానింది. బెంచ్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందకు న్యాయమూర్తులతో కమిటీ వేశామని పేర్కొంది. ఆ కమిటీ నివేదిక వచ్చేవరకు వేచిచూడాలని హైకోర్టు స్పష్టం చేసింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చంద్రబాబు సర్కారుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు అండ ఉండటంతో హైకోర్టు ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులు సాధించవచ్చని భావిస్తోంది. ఇందులో భాగంగానే హైకోర్టుకు లేఖ రాసింది. మరోవైపు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై కర్నూలు కలెక్టర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే, కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు తాండవ యోగేశ్, తురగా సాయిసూర్య దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది.

కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనలపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని హైకోర్టు ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక వచ్చే వరకు వేచిచూడాలని హైకోర్టు పిటిషనర్లను సూచించింది. కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరూ ఊహించలేరు కదా? అంటూ వ్యాఖ్యానించింది. ఆ నివేదికను ఫుల్ కోర్టు ముందుపెట్టి బెంచ్ ఏర్పాటుపై ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేసింది. గుంటూరులో హైకోర్టు బెంచ్ కోసం 1993లో న్యాయవాదులు 103 రోజులపాటు ఆందోళన చేసిన విషయాన్ని గుర్తుచేసిన పిటిషనర్లు.. ఆ సమయంలో బెంచ్ ఏర్పాటును అప్పటి సీజే తిరస్కరించారని కోర్టుకు నివేదించారు.

అయితే ప్రభుత్వం లేఖ రాసినంత మాత్రాన అది తుది నిర్ణయం అవ్వదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ న్యాయశాఖ కార్యదర్శి గత ఏడాది అక్టోబరులో హైకోర్టు రిజిస్ట్రార్ కు రాసిన లేఖలో కర్నూలు బెంచ్ ప్రస్తావన ఉందని పిటిషనర్లు వివరించారు. ఆ లేఖ ప్రకారం న్యాయవ్యవస్థ అధికారాల్లోకి ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లే ఉందని పిటిషనర్లు ఆరోపించారు. అయితే దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ముఖ్యమంత్రి, న్యాయశాఖ కార్యదర్శి నిర్ణయాలకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. కర్నూలులో బెంచ్ ఏర్పాటు అవసరం ఉందో, లేదో అధ్యయనం చేస్తామని వెల్లడించింది. ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో నివేదిక తెప్పించుకున్నామని పేర్కొంది. బెంచ్ ఏర్పాటు విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది.

Tags:    

Similar News