యూట్యూబ్ ల కట్టడికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ప్రముఖ పాడ్‌కాస్టర్ రణవీర్ అల్హాబాదియా కేసును ప్రస్తావిస్తూ, భారతీయ కుటుంబ వ్యవస్థను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమైనవని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కాలంలో జర్నలిస్ట్ అంటే అర్థం మారిపోయింది. ప్రఖ్యాత తెలుగు పత్రికల జర్నలిజం స్కూళ్ల పరీక్ష పాస్ అయ్యి ఆరు నెలల నుంచి ఏడాది ట్రైనింగ్ తీసుకొని డెస్క్ లలో, ఫీల్డ్ మీద పనిచేసి వచ్చేవారే జర్నలిస్టులు అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఒక మైక్, వీడియో ఉంటే చాలు యూట్యూబ్ చానెల్ మొదలుపెట్టి విశ్లేషణలు చెబితే పెద్ద జర్నలిస్ట్ అయిపోతారు. రాత్రికి రాత్రే జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ లేకుండా మాస్ జర్నలిస్ట్ అయిపోతారు. ప్రస్తుత సోషల్ మీడియా విచ్చలవిడి తనంపై సామాన్యులు, రాజకీయ పార్టీలే కాదు సుప్రీం కోర్టు కూడా తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది.
ఆన్‌లైన్ వేదికల నియంత్రణకు చట్టంలో స్పష్టత లేకపోవడం వల్ల యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు దీనిని తమ అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయపడింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ‘‘యూట్యూబ్‌లో ప్రసారమవుతున్న అనేక కార్యక్రమాల్లో సముచిత నియంత్రణ లేకుండా అన్నీ చెల్లుబాటవుతున్నాయి. దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టం చేసింది.
ప్రముఖ పాడ్‌కాస్టర్ రణవీర్ అల్హాబాదియా కేసును ప్రస్తావిస్తూ, భారతీయ కుటుంబ వ్యవస్థను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమైనవని కోర్టు అభిప్రాయపడింది. ‘‘ఈ కేసులో మేము ఇప్పటికే అతనికి నోటీసు జారీ చేశాం. ఇది అత్యంత సున్నితమైన విషయం, దీన్ని నిర్లక్ష్యం చేయలేం’’ అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
కోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఆర్.వెంకటరమణిలను ఈ కేసు తదుపరి విచారణలో సహాయం అందించాల్సిందిగా కోరింది. కేంద్ర ప్రభుత్వం సహకరించాలన్న కోర్టు, యూట్యూబ్ వంటి డిజిటల్ వేదికల నియంత్రణలో ఉన్న లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది.
అంతకు ముందు కోర్టు, రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ‘‘అతని మాటల్లో అశ్లీల భావజాలం కనిపించింది.. ఈ ఆలోచనలను యూట్యూబ్ షో ద్వారా బహిర్గతం చేశారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మొత్తం గా కుటుంబ వ్యవస్థపై నీచంగా కామెంట్స్ చేసిన యూట్యూబర్ పై ఇంటా బయటా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ మాధ్యమంపై సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థమవుతోంది.