ఉచితాలపై సుప్రీం ఎంత సీరియస్ అయ్యిందో తెలుసా?
ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు ఆర్థిక పరిస్థితితో ఏమాత్రం సంబంధం లేకుండా రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు ఆర్థిక పరిస్థితితో ఏమాత్రం సంబంధం లేకుండా రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రకటించేవారికి కూడా తెలుసు అవి సాధ్యం కావని.. అయినా ప్రకటిస్తారు.. ప్రజలు బకరాలు అవుతారు అని చాలా మంది అంటారు. ఏది ఏమైనా... ఉచితాలు భారతదేశంలో ఫుల్ ఫేమస్.
అవును... ఎన్నికల్లో ఇచ్చే ఉచిత పథకాలు ఎంత ఫేమస్ అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఉచిత పథకాలను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు వీటిని ప్రకటించే పద్ధతి మంచి కాదని వ్యాఖ్యానించింది. తాజాగా ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా... పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. ఉచిత పథకాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... ఉచిత పథకాలు మంచివి కావని.. దురదృష్టవశాత్తూ.. వీటి కారణంగా ప్రజలు కష్టపడి పని చేసేందుకు ఇష్టపడడం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇదే సమయంలో.. ఉచితంగా రేషన్, డబ్బులు అందుతున్నాయని.. ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తుండటంతోనే ఇలా జరుగుతోందని.. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే కానీ.. వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయాలంటూ సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా.. జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
ఇక్కడ అసలు విషయం ఏమిటంటే... కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ ను పూర్తి చేసే పనిలో ఉందని.. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యలను పరిష్కరించేందుకు యోచిస్తున్నట్లు అటార్నీ జనరల్ వెంకటరమణి ఈ సందర్భంగా ధర్మాసనానికి తెలిపారు.
ఈ సమయంలో స్పందించిన న్యాయస్థానం.. ఈ నిర్మూలన మిషన్ ఎంతకాలం పాటు పని చేస్తుందో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్ ను మరో ఆరు వారాల తర్వాత విచారిస్తామని వాయిదా వేసింది.