భార్య స్వేచ్ఛను నియంత్రించే హక్కు భర్తకు లేదు!
ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ కు చెందిన ఓ మహిళ భర్త ప్రద్యుమ్ పై ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు పెట్టింది.;
పెళ్లి చేసుకున్నంత మాత్రాన భార్య స్వేచ్ఛను, గోప్యత హక్కును నియంత్రించే హక్కు భర్తకు లేదు, ఉండదని అలహాబాదు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెళ్లి అయ్యాక భార్య స్వేచ్ఛ, గోప్యత హక్కు తగ్గదని కోర్టు చెప్పింది. భార్యతో సన్నిహితంగా ఉన్న వీడియోను ఫేస్‌బుక్‌లో భర్త అప్‌లోడ్ చేసిన కేసులో అలహాబాదు హైకోర్టు ఈ తీర్పుని ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ కు చెందిన ఓ మహిళ భర్త ప్రద్యుమ్ పై ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు పెట్టింది. ఇద్దరూ చనువుగా ఉన్నప్పుడు తన పర్మిషన్ లేకుండా వీడియోను తీసి తన భర్త ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడంతో పాటూ ఆ వీడియోను తన చుట్టాలకు, గ్రామస్థులకు షేర్ చేశాడని భర్తపై క్రిమినల్ కేసు పెట్టింది.
దీంతో ప్రద్యుమ్ భార్య తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ హై కోర్టుని ఆశ్రయించాడు. వారిద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇది నేరం కాదని, రాజీకి ఛాన్స్ ఉందని పిటిషనర్ తరుపు లాయర్ వాదించగా, భర్త అయినంత మాత్రాన భార్య పర్మిషన్ లేకుండా అలాంటి వీడియోలు తీసి షేర్ చేసే హక్కు అతనికి ఉండదని అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నారు.
ఇరువురి వాదనలు విన్న జస్టిస్ వినోద్ దివాకర్, భార్య ఫ్రీడమ్‌ను లాక్కునే హక్కు భర్తకు వివాహం ఇవ్వదని తేల్చి చెప్పారు. మహిళకు తన శరీరంపై పూర్తి హక్కు ఉంటుందని, దాన్ని భర్త గౌరవించాలని, వ్యక్తిగత వీడియోలను షేర్ చేయడం ద్వారా వైవాహిక బంధంలోని నమ్మకాన్ని ప్రద్యుమ్ ఉల్లంఘించాడని కోర్టు తెలిపింది. పెళ్లైనప్పటికీ భార్యకు స్వేచ్ఛ ఉంటుందని, భర్తగా ఆమె గోప్యతను కాపాడటం ఆయన బాధ్యతే మాత్రమే కాదని, నైతిక అవసరం కూడా అని అలహాబాదు హై కోర్టు స్పష్టం చేసింది.