భర్తకు భార్య భరణం చెల్లించాలంటే?
భరించలేని భార్యకు విడాకులు ఇవ్వాలంటే భర్త భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.;
భరించలేని భార్యకు విడాకులు ఇవ్వాలంటే భర్త భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తన సొంత ఆస్తులను భార్యకు కోల్పోవాలి. కోర్టులో భార్య ఏం చెబితే అదే చట్టం!.. హిందూ వివాహ చట్టం గురించి ఇలాంటి ఎన్నో అపోహలు ఉన్నాయి. నిరూపించగలిగితే భర్త కూడా భార్య నుంచి భరణం అందుకోగలడా? అంటే.. అదెలాగో తెలుసా? ఇది తెలుసుకోవాలంటే అసలు కోర్టులు భరణాన్ని ఎలా నిర్ణయిస్తాయో తెలుసుకోవాలి.
విడాకుల సందర్భంలో భార్యాభర్తలిద్దరి ఆర్థిక స్థితి, ఆధారపడిన జీవిత భాగస్వామి, పిల్లల న్యాయపరమైన అవసరాలు, దరఖాస్తుదారుడి స్వతంత్ర ఆదాయం -ఆస్తులు లేదా ఆధారపడిన జీవిత భాగస్వామి చేసే చట్టపరమైన ఖర్చులు, ఇరు పార్టీల ఆదాయం, వివాహ సమయంలో ప్రవర్తన, సామాజిక, ఆర్థిక స్థితి, వ్యక్తిగత ఖర్చులు వంటి అనేక అంశాలను ఫ్యామిలీ కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. ఇవన్నీ చాలా కాంప్లికేషన్లను తెస్తాయి గనుక చాలా భరణ వివాదాలు సుప్రీంకోర్టుకు చేరుకుంటాయి! అని భారత సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు చెప్పారు.
భరణ చట్టాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు గతంలోనే హెచ్చరించింది. భరణం ఉద్దేశ్యం ఆధారపడిన జీవిత భాగస్వామికి మద్దతు ఇవ్వడం.. దీని అర్థం ఇతర పక్షాన్ని శిక్షించడం కాదని పేర్కొంది. పురుషులు భరణం పొందవచ్చా? అంటే.. భరణం సాధారణంగా భార్యలకు ఆర్థిక సహాయాన్ని ఉద్ధేశించినది.. అయితే చాలా అసాధారణ పరిస్థితులలో మగవారు కూడా భరణం పొందేందుకు భారతీయ చట్టంలో క్లాజ్ ఉంది.
హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్లు 24 & 25 ప్రకారం, భర్తలు తమ భార్యలపై ఆర్థికంగా ఆధారపడటాన్ని నిరూపించగలిగితే భరణం అభ్యర్థించవచ్చు. అయితే ప్రత్యేక వివాహ చట్టం 1954 , గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, 2005 వంటి చట్టాలు ప్రధానంగా భర్తలు భార్యలకు భరణం చెల్లించడం గురించే నిర్ధేశిస్తాయి. భర్త ఏదైనా అంగవైకల్యం కారణంగా సంపాదించలేని స్థితిలో ఉంటే, అతడికి సంపాదించే భార్య భరణం చెల్లించుకోవాలి. అయితే కోర్టులు చాలావరకూ పురుషులకు భరణం ఇవ్వడానికి ఇష్టపడవు! అని సుప్రీం లాయర్ ఒకరు విశ్లేషించారు.
ఇతర దేశాలలో భరణం లెక్కింపులు, జీవిత భాగస్వామి మద్దతు విషయానికి వస్తే వివిధ దేశాలు విభిన్న విధానాలను అనుసరిస్తాయి. అమెరికా, యూకేలో కొన్ని రాష్ట్రాలు కోర్టులు ఒక స్థిరమైన సూత్రాన్ని ఉపయోగిస్తాయి. మరికొన్ని దేశాల్లో జీవితాంతం చెల్లింపుల కంటే స్వల్పకాలిక ఆర్థిక సహాయం కోరతాయి. స్కాండినేవియన్ దేశాలలో భరణం చాలా అరుదు. ఎందుకంటే భాగస్వాములిద్దరూ ఎవరికి వారు సంపాదనాపరులుగా ఉంటారు. చైనా, జపాన్ లో కోర్టులు ఒకేసారి చెల్లింపు పరిష్కారం నిర్ణయిస్తాయి. మధ్యప్రాచ్య దేశాలు షరియా చట్టాన్ని అనుసరిస్తాయి. మద్దతు సాధారణంగా విడాకుల తర్వాత స్వల్ప కాలానికి పరిమితం. భారతదేశంలో విడాకుల వ్యవహారం తప్పుడు పంథాలో భర్తను బలి పశువును చేసే విధంగా చాలా కాలం ఉందని ప్రముఖ అడ్వకేట్ వ్యాఖ్యానించారు. దీనితో పోలిస్తే చాలా దేశాలు తప్పుకు ఆస్కారం లేని విధానాన్ని విడాకులలో అనుసరిస్తున్నాయని ఆయన తెలిపారు.
కేసుల వారీగా విధానం భరణ చెల్లింపులను ఇతర పాశ్చాత్య న్యాయ వ్యవస్థల మాదిరిగా కాకుండా, భారతీయ కోర్టులు ప్రతి కేసును ఒక్కొక్కటిగా విడిగా చూస్తాయి. ఇరు పార్టీల ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి కోర్టు ఏకమొత్తం చెల్లింపు లేదా నెలవారీ నిర్వహణను ఆదేశించవచ్చు. క్రికెటర్ చాహల్- ధనశ్రీ విడాకుల వ్యవహారంలో 4.75 కోట్ల చెల్లింపుతో కాపురం ముగింపు తీర్పు వెలువడిన నేపథ్యంలో భరణంపై మరోసారి చాలా చర్చ సాగుతోంది.