'వక్షోజాలను పట్టుకోవడం అత్యాచారయత్నం కాదు'... హైకోర్టు తీర్పు!
ఓ మైనర్ బాలిక (11)పై ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు! ఇందులో భాగంగా.. ఆమె వక్షోజాలు పట్టుకుని ఆమెను కల్వర్టు కిందకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు.;
ఓ మైనర్ బాలిక (11)పై ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు! ఇందులో భాగంగా.. ఆమె వక్షోజాలు పట్టుకుని ఆమెను కల్వర్టు కిందకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఆమె వేసుకున్న పైజామా నాడాలు కట్ చేశారు! ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు అడ్డుకున్నారు. దీంతో వారిపై అత్యాచారయత్నం కింద కేసు నమోదైంది.
ఈ క్రమంలో కేసు ట్రయల్ కోర్టు వీరికి సమన్లు జారీ చేసింది. దీంతో.. నిందితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు! ఈ సందర్భంగా.. తాజాగా స్పందించిన కోర్టు.. మహిళ వక్షోజాలు పట్టి లాగడం, పైజామా నాడాలు విప్పడం వంటి చర్యలు అత్యాచారయత్నం కిందికి రావని తెలిపింది. దీంతో.. ఈ తీర్పు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అవును... జాతీయ మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం... 2021లో ఉత్తర్ ప్రదేశ్ లోని కాస్ గంజ్ ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల మైనర్ బాలిక తన తల్లితో కలిసి నడుస్తూ వెళ్తోంది. ఈ సమయంలో అటువైపు బండిపై వస్తున్న పవన్, ఆకాష్ అనే ఇద్దరు యువకులు.. ఆమెను గ్రామంలో వదిలిపెడతామని చెప్పి బండి ఎక్కించుకున్నారు. మార్గమధ్యలో బండి ఆపారు.
ఈ సమయంలో ఆమెను కిందకు దింపి.. ఆ చిన్నారి వక్షోజాలు పట్టుకుని.. కల్వర్టు కిందకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఆమె పైజామా నాడాలు కట్ చేసి ఫ్యాంటు కిందకు లాగే ప్రయత్నం చేశారు! ఈ సమయంలో బాలిక హాహాకారాలు విన్న స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో.. ఆ యువకులు ఇద్దరూ అక్కడ నుంచి పారిపోయారు.
దీంతో.. బాలిక తల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితులపై కేసు పెట్టారు. దీంతో... పోలీసులు వారిని అరెస్ట్ చేసి ట్రయల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో వారు ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), ఫోక్సో చట్టంలోని సెక్షన్ 18 కింద విచారణ ఎదుర్కోవడానికి సమన్లు జారీ అయ్యాయి. దీంతో.. నిందితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంగా గురువారం జస్టిస్ రామ్ మనోహర్ నారయాణ్ మిశ్రా స్పందిస్తూ... నిందితులైన పవన్, ఆకాష్ లపై మోపబడిన ఆరోపణలు, కేసు యొక్క వాస్తవాలు, ఈ కేసులో అత్యాచారయత్న నేరంగా పరిగణించబడవని.. బాలికపై అత్యాచారయత్నం చేయాలని ప్రయత్నించడానికి, నేరం చేయడానికి వ్యత్యాసం ఉంటుందని వివరించారు.
నిందితులు బాలికపై అత్యాచారం చేయాలనే ఉద్దేశ్యంతోనే బాలికపై దారుణానికి పాల్పడ్డారని ఎలాంటి ఆధారాలు రికార్డులో లేవని జస్టిస్ మిశ్రా వెల్లడించారు. బాధితురాలి పైజామా నాడాలు కట్ చేసి, ఆమెను కల్వర్టు కిందకు లాగేందుకు ప్రయత్నించారే తప్ప.. ఆమెపై వారు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారని చెప్పే సాక్ష్యాలు లేవని అన్నారు!
ఈ సందర్భంగా... ఇద్దరు నిందితులపై ఉన్న అభియోగాలను కోర్టు ఐపీసీ సెక్షన్ 354బి (వస్త్రాలను తొలగించే ఉద్దేశ్యంతో దాడి లేదా నేరపూరిత బలప్రయోగం!), ఫోక్సో చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు) కింద అభియోగాలు మార్చారు!
ప్రస్తుతం ఈ వ్యవహారంపై నెట్టింట తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా... సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఎక్స్ వేదికగా ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించారు.