సంచలనం... 24 మంది హత్య కేసులో 44 ఏళ్ల తర్వాత తీర్పు!
ఈ మేరకు మెయి పురి కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి... కప్తాన్ సింగ్, రామ్ పాల్, రామ్ సేవక్ లను దోషులుగా నిర్ధారించి.. వారికి మరణశిక్ష, రూ.50వేల జరిమానా విధించారు;
నాలుగు దశాబ్ధాలకు పైగా నలుగుతోన్న కేసులో తాజాగా సంచలన తీర్పు వెలువడింది. సుమారు 44 ఏళ్ల క్రితం జరిగిన దిహులి దళిత ఊచకోత కేసులో న్యాయస్థానం ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. ఈ మేరకు మెయి పురి కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి... కప్తాన్ సింగ్, రామ్ పాల్, రామ్ సేవక్ లను దోషులుగా నిర్ధారించి.. వారికి మరణశిక్ష, రూ.50వేల జరిమానా విధించారు.
అవును... న్యాయం కోసం 44 ఏళ్లుగా ఎదురుచూసిన వారి నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. దిహులి గ్రమ ఊచకోత కేసులో దోషులుగా తేలిన ముగ్గురు వ్యక్తులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ సందర్భంగా కోర్టు ఇచ్చిన తీర్పు.. న్యాయం సాధించిన విజయంగా బాధిత కుటుంబాలు అభివర్ణించాయి. ఇది ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పటి కేసు కావడం గమనార్హం.
వివరాళ్లోకి వెళ్తే... 1981 నవంబర్ 18 సాయంత్రం ఫిరోజాబాద్ జిల్లాలోని దిహులి గ్రామంలో 17 మంది సాయుధ బందిపోట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 23 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించారు. ఈ విధంగా మొత్తం 24 మంది దళితులు దారుణంగా హత్య చేయబడ్డారు.
ఈ ఘటన తర్వాత.. స్థానిక నివాసి లైక్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తులో ముఠా నాయకులు రాధేశ్యామ్, సంతోష్ సింగ్ లతో సహా 17 మంది బందిపోట్లను నిందితులుగా తేల్చారు! అయితే.. విచారణ సమయంలో 13 మంది నిందితులు మరణించగా.. ఒక నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ ఊచకోత తర్వాత... అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ బాధిత కుటుంబాలను కలిశారు. ఇదే సమయంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి బాధిత కుటుంబాలను పరామర్శించి, సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా దిహులి నుంచి సదుపూర్ వరకూ కాలినడకన ప్రయాణించారు.
ఈ సందర్భంగా స్పందించిన ప్రభుత్వ న్యాయవాది రోహిత్ శుక్లా... నాలుగు దశాబ్ధాల తర్వాత బాధిత కుటుంబాలకు న్యాయం జరిగింది.. ఇది చారిత్రాత్మక తీర్పు.. ఈ దేశంలో ఏ నేరస్తుడూ చట్టం నుంచి తప్పించుకోలేడని సమాజానికి సందేశం పంపుతుంది అని అన్నారు.