పోసాని విడుదలకు పీటీ వారెంట్ తో సీఐడీ బ్రేకులు!
పీటీ వారెంట్ అనేది పబ్లిక్ ట్రస్ట్ వారెంట్ అనే పదానికి సింఫుల్ గా చెప్పొచ్చు. న్యాయ వ్యవస్థలో వినియోగించే ఒక విధానం.;
నోటికి వచ్చినట్లుగా బూతులు తిడుతూ.. దారుణ రీతిలో వ్యక్తిగత విమర్శలు మాత్రమే కాదు.. తాను టార్గెట్ చేసిన రాజకీయ ప్రత్యర్థుల కుటుంబ సభ్యులను దూషించిన ఉదంతాలకు సంబంధించి ప్రముఖ నటుడు కం వైసీపీ నేత పోసాని క్రిష్ణమురళీ రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన అరెస్టుకు ముందు.. తర్వాత ఆయనపై బోలెడన్ని కేసులు ఏపీ వ్యాప్తంగా నమోదయ్యాయి. ఆయన మీద పలు ప్రాంతాల్లో నమోదైన కేసుల నేపథ్యంలో ఒక జైలు నుంచి మరో జైలుకు తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయనపై నమోదైన కేసులకు సంబంధించి బెయిల్ లభించింది. దీంతో ఆయన విడుదలకు మార్గం సుముగమైందని భావించారు.
అయితే.. ఆయన రిలీజ్ కు బ్రేకులు పడేలా ఉన్నాయి. దీనికి కారణం పోసాని మీద సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. తాజాగా వారు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్ పై పోసానిని కోర్టు ఎదుట హాజరుపర్చనున్నారు. అయితే.. జైలు నుంచే వర్చువల్ గా పోసాని క్రిష్ణమురళిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారు. ఏపీ సీఐడీ పోలీసులు పీటీవారెంట్లతో జైలువద్దకు వెళ్లటంతో ఆయన విడుదల ఆగింది.
ఇంతకూ పీటీ వారెంట్ అంటే ఏమిటి? దానికి ఉండే పరిమితులు ఏమిటి? ఈ వారెంట్ తో కోర్టు నుంచి బెయిల్ పొందిన వారి విడుదలను అడ్డుకోవచ్చా? లాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటి వివరాల్లోకి వెళితే..
- పీటీ వారెంట్ అనేది పబ్లిక్ ట్రస్ట్ వారెంట్ అనే పదానికి సింఫుల్ గా చెప్పొచ్చు. న్యాయ వ్యవస్థలో వినియోగించే ఒక విధానం. ప్రభుత్వం లేదంటే ప్రభుత్వ అనుబంధ సంస్థలకు చెందిన అధికారుల నుంచి జారీ చేస్తారు. ఈ వారెంట్ ను అయితే జడ్జి ద్వారా కానీ ఇతర అధికారుల ద్వారా జారీ చేసే వీలుంది. ఇందుకు ప్రభుత్వ ఉద్యోగి లేదంటే.. ఒక హోదాకు చెందిన వారు జారీ చేసే వీలుంది. అయితే.. ఈ ఆదేశాలకు కోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
- పీటీ వారెంట్లకు పరిమితులు ఉంటాయా? అంటే.. ఎందుకు ఉండవు. ఉంటాయనే చెప్పాలి. మిగిలిన అంశాలకు తగ్గట్లే పీటీ వారెంట్లకు పరిమితులు ఉంటాయి. అధికారులు జారీ చేసే పీటీ వారెంట్లను కోర్టులు అంగీకరించొచ్చు. తిరస్కరించొచ్చు. సంబంధిత అధికారులు జారీ చేసిన పీటీ వారెంట్ జారీకి సంబంధించి సరైన ఆధారాలు.. సాక్ష్యాలు లేకున్నా..దర్యాప్తు అధికారి సరైన కారణాలు చూపించకపోతే కోర్టు అనుమతి ఇవ్వదు.
- పీటీ వారెంట్ జారీ చేసిన సంస్థ లేదా అధికారి తాము జారీ చేసిన వారరెంట్ లో పేర్కొన్న సమాచారం అసంపూర్ణంగా ఉన్నా.. తప్పుడు సమాచారంతో ఉన్నా కోర్టు ఈ వారెంట్ ను రిజెక్టు చేస్తుంది. పీటీ వారెంట్ జారీకి సంబంధించి కోర్టు అడిగే సమాచారానికి సంబంధించి తగిన వివరణ ఇవ్వటంలో ఫెయిల్ అయితే కూడా దీన్ని కోర్టు తిరస్కరిస్తుంది. కొన్ని సందర్భాల్లో రాజకీయ.. వ్యక్తిగత స్థాయిల్లో అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లుగా కోర్టు భావిస్తే.. ఈ వారెంట్ ను అంగీకరించకపోవచ్చు. న్యాయనిపుణుల అభిప్రాయాన్ని తీసుకుంటే.. విచారణ సంస్థలు జారీ చేసే పీటీ వారెంట్లకు ఎక్కువసార్లు కోర్టు సమర్థిస్తాయని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రం వారి వాదన.. వారు చూపించే సాక్ష్యాలు పేలవంగా ఉంటే మాత్రం కోర్టు పీటీ వారెంట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే వీలుంది.