సనాతనం కామెంట్స్..ఉదయనిధికి సుప్రీం ఊరట!

సనాతనం అంటే ఒంటికాలుపై లేస్తారు డీఎంకే నేతలు. తమిళనాడులో ఇప్పుడంతా అక్కడ హిందీ భాష, డీలిమిటేషన్ పై సమరం నడుస్తోంది.;

Update: 2025-03-06 09:46 GMT

సనాతనం అంటే ఒంటికాలుపై లేస్తారు డీఎంకే నేతలు. తమిళనాడులో ఇప్పుడంతా అక్కడ హిందీ భాష, డీలిమిటేషన్ పై సమరం నడుస్తోంది. తమిళ యువ దంపతులు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలను కనాలని సూచిస్తున్నారు. అలాగే హిందీ భాషపై పోరు సాగిస్తున్నారు తమిళ నేతలు. దేశాన్ని హిందియా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే వీరికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వచ్చే ఏడాది అక్కడ ఎన్నికలు ఉండటంతో ఇప్పటి నుంచే అక్కడ రాజకీయ పోరు ప్రారంభమైపోయింది.

తమిళనాడులో హై వోల్టేజీ పాలిటిక్స్ నడుస్తున్న ప్రస్తుత టైంలో డీఎంకే యువనేత ఉదయనిధి ఆ మధ్య సనాతనంపై చేసిన ఘాటు వ్యాఖ్యలకు భారీ ఊరట లభించింది. 2023 సెప్టెంబర్ లో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చారు. వాటిని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత సైతం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. కులం, మతం ఆధారిత వివక్ష, సామాజిక అన్యాయాలను మాత్రమే తాను విమర్శించానని చెప్పారు.

ఉదయనిధి వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ మండిపడ్డాయి. దేశంలోని పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ లల్లో ఎఫ్ఐఆర్ లు రికార్డు అయ్యాయి. దీన్ని సవాల్ చేస్తూ ఉదయనిధి స్టాలిన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులన్నింటినీ ఏకీకృతం చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా విచారణ చేపట్టింది సుప్రీం ధర్మాసనం. ఉదయనిధి తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న ఎఫ్ ఐఆర్లతో పాటు బిహార్ లో కొత్తగా ఫిర్యాదులు దాఖలయ్యాయని బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. నుపుర్ శర్మ సహ ఇలాంటి కేసుల్లో సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా సింఘ్వీ ప్రస్తావించారు.

ఈ విషయాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ తో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. కొత్త ఎఫ్ఐఆర్ లు, కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది. ఒక వేళ ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాల్సి వస్తే తమ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అనంతరం విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News