పోసానికి ఊరట.. వర్మకు విరామం.. ఒకే రోజు ఇద్దరికీ ఉపశమనం
తమ మద్దతుదారులైన సినీ ప్రముఖులు దర్శకుడు ఆర్జీవీ, హాస్యనటుడు పోసాని క్రిష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఉపశమనం లభించింది;
ఏపీ హైకోర్టులో ఈ రోజు వైసీపీకి స్వల్ప ఊరట లభించింది. తమ మద్దతుదారులైన సినీ ప్రముఖులు దర్శకుడు ఆర్జీవీ, హాస్యనటుడు పోసాని క్రిష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఉపశమనం లభించింది. సోషల్ మీడియాలో దుర్భాషలు, అనుచిత ప్రవర్తన కింద ఈ ఇద్దరిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోసానిని అరెస్టు చేసి పీటీ వారెంటుపై రాష్ట్రం అంతా తిప్పుతుండగా, వర్మను విచారించేందుకు సీఐడీ నోటీసులిచ్చింది. అయితే ఈ ఇద్దరూ తమపై కేసులు కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించగా, ఇద్దరికి స్పల్ప ఉపశమనం లభించింది.
పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదవ్వగా, పోలీసులు ఒక్కో కేసులో అరెస్టు చేస్తూ రిమాండుకు తరలిస్తున్నారు. అయితే మొత్తం కేసులను కొట్టివేయాలని పోసాని క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, విచారించిన హైకోర్టు చిత్తూరు, విశాఖ జిల్లాల్లో నమోదైన కేసుల్లో తదుపరి చర్యలపై హైకోర్టు రక్షణ కల్పించింది. కోర్టు తుది నిర్ణయం తీసుకునేవరకు ఆ రెండు కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఈ కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
ఇక కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా తీసి చిక్కుల్లో పడిన దర్శకుడు రామగోపాల్ వర్మకు కాస్త విరామం దొరికింది. ఈ కేసులో విచారణకు రమ్మంటూ ఏపీ సీఐడీ పోలీసులు వర్మకు గతంలోనే నోటీసులు జారీ చేయగా, ఆయన ఇంతవరకు వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. అయితే పోసాని అరెస్టు తర్వాత తనను అరెస్టు చేసే అవకాశం ఉందనే భయంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వర్మపై ఆరు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు సూచించింది. ఈ పిటిషన్ విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.
సినీ రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులకు ఒకేసారి కోర్టు నుంచి రక్షణ లభించడంతో వైసీపీ ఊపిరిపీల్చుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియా కేసుల్లో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. కోర్టు కూడా ప్రభుత్వ చర్యలకు మద్దతుగా నిలిచేలా నిందితులకు రిమాండ్ కు పంపుతుండటంతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి అండగా నిలిచిన సినీ ప్రముఖులు కూడా జైలుకు వెళుతుండటంతో కార్యకర్తలు మరింత భయపడుతున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కోర్టు ఆ ఇద్దరికి కాస్త అనుకూలంగా తీర్పునివ్వడంతో ప్రస్తుతానికి వైసీపీ నేతలు ఉపశమనం పొందారని చెబుతున్నారు.