ఆ విమర్శకే మండలి నుంచి బహిష్కరణ.. ఆర్జేడీ ఎమ్మెల్సీకి సుప్రీం ఊరట
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. దీనికి రెండు వైపులా పదును ఉంటుంది. ఈ స్వేచ్ఛ మాత్రమే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఉంటుంది.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. దీనికి రెండు వైపులా పదును ఉంటుంది. ఈ స్వేచ్ఛ మాత్రమే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఉంటుంది. అలా అని ఇష్టారాజ్యంగా మాట్లాడటం కూడా సరి కాదు. కానీ.. బిహార్ శాసన మండలిలో ఇటీవల చోటు చేసుకున్న ఒక పరిణామం కొత్త చర్చకు తెర తీయమే కాదు.. ఈ షాకింగ్ ఉదంతంపై సుప్రీం ఇచ్చిన తీర్పు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆర్జేడీ మండలి సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ పై ఎథిక్స్ కమిటీ బహిష్కరణ వేటు వేయటం షాకింగ్ గా మారింది. ఇంతకూ సదరు సభ్యుడు చేసిన దారుణ వ్యాఖ్యలు ఏమిటి? ఆ విమర్శలకే బహిష్కరణ వేటు వేయాలా? అన్నది ప్రశ్న. ఇంతకూ సభలో సీఎం నితీశ్ ను ఉద్దేశించి ఈ ఆర్జేడీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యల్లోకి వెళితే..
‘పాము కుబుసం విడిచినట్టు తరచూ రాజకీయ అభిప్రాయాల్ని మార్చుకోవటం నితీశ్ కు అలవాటు. ఇప్పటికి తొమ్మిదిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అయినా.. ఎమ్మెల్యేగా ప్రజల నుంచి ఎన్నిక కాలేదు. అధికారమే పరమావధిగా ఒకసారి యూపీఏ.. మరోసారి ఎన్డీయే కూటమితో చెలిమి చేస్తారు. ఆయన పాల్తూరామ్’ అంటూ నిప్పుడు చెరిగారు. ఈ వ్యవహారం బిహార్ శాసన మండలిలో గత ఏడాది మార్చిలో చోటు చేసుకుంది.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. సునీల్ కుమార్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తూ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు. తగిన విచారణ చేసిన సదరు కమిటీ ఆయనపై బహిష్కరణ వేటుకు సిపార్సు చేయగా.. కొలువు తీరిన మండలి ఆయన్ను సభ నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేసింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని విచారించేందుకు సుప్రీం సానుకూలంగా స్పందించింది. అంతేకాదు.. బహిష్కరణ వేటును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ కు స్పందనగా.. తక్షణమే సదరు సభ్యుడ్ని సభలోకి అనుమతించాలని పేర్కొంది.
సభలో సభ్యుల అనుచిత ప్రవర్తనకు తగిన శిక్ష ఉండాలే తప్పించి మితిమీరకూడదని స్పష్టం చేసింది. అయితే.. న్యాయస్థానాలకు ఇలా ఆదేశాలు జారీ చేసే పరిధి లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. సునీల్ కుమార్ సింగ్ పిటిషన్ కు అసలు విచారణార్హత లేదని.. 212(1) అధికరణ న్యాయవ్యవస్థ జోక్యం నుంచి తమకు రక్షణ ఇస్తుందని మండలి తరఫు న్యాయవాది వాదించగా.. దీన్నీ సుప్రీం అంగీకరించలేదు. చట్టసభల కార్యకలాపాలు వేరు.. అందులో తీసుకున్న నిర్ణయాలు వేరని స్పష్టం చేసింది. చట్టసభల నిర్ణయాలు వ్యక్తుల ప్రాథమిక హక్కుల్ని ప్రభావితం చేసినప్పుడు వాటిని సమీక్షించే అధికారం కోర్టులకు ఉందని స్పష్టం చేసింది. ఏమైనా.. ప్రజాస్వామ్యంలో కీలకమైన శానస వ్యవస్థ.. న్యాయవ్యవస్థ రెండూ కీలకమే అన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పొచ్చు.