ఏడున్నర గంటల సుదీర్ఘ వాదన తర్వాత పోసానికి రిమాండ్!

ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం శుక్రవారం ఉదయం 5 గంటల వేళలో పోసాని క్రిష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు 14రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.;

Update: 2025-02-28 04:43 GMT

ఇటీవల కాలంలో ఒక కేసు విషయంలో సుదీర్ఘ సమయం వరకు కోర్టులో వాదనలు జరగటం. అది కూడా ఒక ప్రముఖుడి అరెస్టు సందర్భంలో కావటం ఒక ఎత్తు అయితే.. రాత్రి తొమ్మిదిన్నర గంటల వేళలో మొదలైన వాదనలు తెల్లవారుజాము 5 గంటల వరకు కంటిన్యూ కావటం మరో ఎత్తుగా చెప్పాలి. అరెస్టు నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని పోసాని తరఫు న్యాయవాది.. ఆయనకు రిమాండ్ విధించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది సుదీర్ఘంగా వాదనలు వినిపించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం శుక్రవారం ఉదయం 5 గంటల వేళలో పోసాని క్రిష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు 14రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. మార్చి 12 వరకు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన్ను కడప సెంట్రల్ జైలుకు తరలిస్తారని చెబుతున్నారు. పోసాని తరఫు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని కోర్టు కోరగా.. అందుకు కోర్టు నో చెప్పింది.

పోసాని అరెస్టు నేపథ్యంలో ఏడు గంటల పాటు పోలీసులు విచారణ చేపట్టగా.. మరో ఏడున్నర గంటల పాటు కోర్టులో వాదనలు చోటు చేసుకున్నాయి. ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నాయకుడు జోగినేని మణి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటం.. దీనికి స్పందించిన ఓబులవారి పల్లె పోలీసు స్టేషన్ సిబ్బంది హైదరాబాద్ కు వచ్చి పోసానిని అరెస్టు చేశారు. ఆయన్ను కర్నూలు మీదుగా ఓబులవారి పల్లెకు తీసుకొచ్చారు.

వైద్య పరీక్షలు చేయించి.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నివేదిక వచ్చిన తర్వాత విచారణ మొదలు పెట్టారు. ఈ కారణంగానే గురువారం మధ్యాహ్నం 1.30 గంటల వరకు సమయం పట్టింది. మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రశ్నలు వేశారు. దాదాపు ఏడు గంటల పాటు విచారణ సాగగా.. మొత్తం విచారణను వీడియో.. ఆడియో రికార్డింగ్ చేశారు.

అనంతరం రైల్వే కోడూరు కోర్టు మేజిస్ట్రేట్ కు పోలీసులు తమ నివేదికను అందజేశారు. పోలీసులు సమర్పించిన నివేదిక.. అందులోని అంశాలు.. సమర్పించిన ఆధారాలు బెయిల్ ఇచ్చేందుకు వీలుగా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ సీనియర్ న్యాయవాది.. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా వ్యవహరించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది కూడా తన వాదనల్ని బలంగా వినిపించారు. దీంతో.. సుమారుఏడున్నర గంటల పాటు ఇరు వర్గాల వాదనలు కోర్టుకు వినిపించారు. వీరి వాదనలకు తెర దించుతూ.. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల వేళలో 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేయటంతో.. పోసాని అరెస్టు ఎపిసోడ్ ఒక కొలిక్కి వచ్చినట్లైంది.

Tags:    

Similar News