విజయసాయిరెడ్డికి షాక్.. కుమార్తె నేహా రెడ్డిపై హైకోర్టు సీరియస్!
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. విశాఖ బీచ్ రోడ్డులో విఎస్ఆర్ కుమార్తె నేహా రెడ్డి కంపెనీ నిర్మించిన కట్టడాలపై విచారించిన హైకోర్టు..;
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. విశాఖ బీచ్ రోడ్డులో విఎస్ఆర్ కుమార్తె నేహా రెడ్డి కంపెనీ నిర్మించిన కట్టడాలపై విచారించిన హైకోర్టు.. అక్రమ కట్టడాల తొలగింపునకు అయిన ఖర్చు మొత్తం వసూలు చేయాలని ఆదేశించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయసాయిరెడ్డికి చెందిన అక్రమ ఆస్తులపై ప్రభుత్వం కఠిన వైఖరి ప్రదర్శిస్తోందని చెబుతున్నారు.
ఇందులో భాగంగా ఆయన కుమార్తె నేహారెడ్డికి చెందిన కంపెనీ పేరిట ఉన్న విలువైన భూముల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ చర్యలకు రంగం సిద్ధం చేస్తోందంటున్నారు. మరోవైపు ఇదే విషయంపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ వేయడం, విచారణలో నేహారెడ్డి కంపెనీ అక్రమాలపై హైకోర్టు సీరియస్ అవడం వంటి పరిణామాలు వీఎస్ఆర్ కు షాకింగ్ గా చెబుతున్నారు.
విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులో అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. సీఆర్ జడ్ నిబంధనలకు విరుద్ధంగా గోడ నిర్మించారని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి వ్యాపార భాగస్వామిగా ఉన్న కంపెనీపైనా న్యాయస్థానం మండిపడింది. కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి.. క్రిమనల్ చర్యలు తీసుకోవాలని సూచించడం సంచలనంగా మారింది.
సముద్ర తీరానికి ఆనుకుని నేహారెడ్డి కంపెనీ అక్రమ నిర్మాణాలు చేపట్టిందని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పిల్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై గతంలోనే విచారించిన హైకోర్టు.. ఆక్రమణలు, అక్రమాలపై ఐదుగురు నిజాయితీపరులైన ఉన్నతాధికారులతో కమిటీ వేసి నివేదిక సమర్పించాలని గత విచారణ సందర్భంగా ఆదేశించింది.
ఈ విచారణ కొనసాగుతుండగానే ఈ రోజు విచారించిన హైకోర్టు ఆరు అడుగుల మేర పునాదిని వదిలేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని వ్యాఖ్యానించింది. గోడ వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు పర్యావరణ. అటవీ మంత్రిత్వ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలి. గోడ కూల్చివేత ఖర్చు, పర్యావరణ నష్టం నేహారెడ్డి కంపెనీ నుంచి రాబట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. భీమిలి వద్ద 4 రెస్ట్రో బార్ల అక్రమ నిర్వహణపై దాఖలైన పిల్ పైనా హైకోర్టులో విచారణ జరిగింది.