యూట్యూబరూ.. ఇదే తగ్గించుకుంటే మంచిది!

దేశమంతటా సంచలనం రేపిన ‘ఇండియా హాజ్‌ గాట్‌ టాలెంట్‌’ యూట్యూబ్‌ షో వివాదం ఇంకా ముదురుతూనే ఉంది.;

Update: 2025-03-04 10:08 GMT

దేశమంతటా సంచలనం రేపిన ‘ఇండియా'స్ గాట్ లేటెంట్’ యూట్యూబ్‌ షో వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. ఈ షోలో చేసిన అసభ్యకర వ్యాఖ్యల కారణంగా ప్రముఖ యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అలహాబాదియా చట్టపరమైన ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంలో రణ్‌వీర్‌తో పాటు షో హోస్ట్‌ సమయ్‌ రైనా కూడా కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కెనడాలో నిర్వహించిన ఓ షోలో సమయ్‌ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. ‘‘బీర్‌బైసెప్స్‌ (రణ్‌వీర్‌ అలహాబాదియా)ను గుర్తు పెట్టుకోండి! బహుశా నా అదృష్టం అంతగా కలిసి రావడం లేదు. కానీ ఒకటి మాత్రం మర్చిపోకండి—నా పేరే సమయ్‌’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక, ‘‘ఈ షో టికెట్లు కొనడం ద్వారా నా కోర్టు ఖర్చులు భరించినందుకు ధన్యవాదాలు’’ అంటూ తనపై వచ్చిన కేసులను హాస్యరూపంలో ప్రస్తావించారు.

ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానిస్తూ, ‘‘ఈ యువకులు తమకే అన్నీ తెలుసనుకుంటున్నారు. బహుశా మేము పాతతరమని భావిస్తారా? వీరిలో ఒకరు విదేశాలకు వెళ్లి మరింత హాస్యంగా ప్రవర్తించారు. మా న్యాయపరిధి ఎంత వరకు విస్తరించి ఉందో వీరికి తెలుసా?’’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. అయితే, ‘‘ఇంతటితో ఆగిపోతాం. ఇవే చివరి హెచ్చరికలు. వారు తమ తప్పును అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

అలహాబాదియాకు కూడా కోర్టు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ‘‘భావ ప్రకటన స్వేచ్ఛను అర్థం చేసుకోవాలి. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. ఈ పరిమితులను దాటితే చట్టం తన విధిని నిర్వర్తిస్తుంది’’ అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అయితే, రణ్‌వీర్‌ యూట్యూబ్‌ షోపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. కానీ, ఇకపై నైతిక ప్రమాణాలకు లోబడి వ్యవహరించాలని, ఈ విషయాన్ని అంగీకరిస్తూ హామీ పత్రం సమర్పించాల్సిందిగా ఆదేశించింది.

Tags:    

Similar News