సినిమాలతో మీదపడ్డ అప్పులు.. చివరికి ఇల్లు పోయే పరిస్థితి!
సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఆదాయం అందుకున్న నటులు కొన్నాళ్ల అనంతరం ఒక్కసారిగా డౌన్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.;
సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఆదాయం అందుకున్న నటులు కొన్నాళ్ల అనంతరం ఒక్కసారిగా డౌన్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక వారసులు కొందరు ఆస్తులను డబుల్ చేస్తే మరికొందరు ఉన్నదంతా అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఇక అలాంటి వారిలో మరో సీనియర్ నటుడు వారసుడి పరిస్థితి గందరగోళంగా మారింది.
తమిళ సినీ ప్రపంచంలో చిరస్మరణీయమైన పేరు శివాజీ గణేశన్. ఇక నరసింహా సినిమాలో రజినీకాంత్ తండ్రిగా ఆయన నటించిన విధానం ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. చాలా కష్టపడి ఎదిగిన ఆయన వారసులకు మంచి ఆస్తులే కూడబెట్టారు. కానీ, ఇప్పుడు ఆయన ఇంటి చుట్టూ తీవ్ర వివాదం చెలరేగింది. ఇటీవల తమిళనాడు హైకోర్టు ఆయన ఇంటిని జప్తు చేయాలంటూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామం తమిళ సినీ అభిమానులను, ఆయన్ని గౌరవించే వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఈ వివాదానికి కారణం శివాజీ గణేశన్ మనవడు దుష్యంత్. ఆయన సినీ నిర్మాణ సంస్థ ‘ఈశాన్ ప్రొడక్షన్స్’ ద్వారా నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. అయితే, నష్టాల వల్ల ఆర్థిక ఒత్తిడిలో చిక్కుకున్న దుష్యంత్, తన సతీమణి అభిరామితో కలిసి ధనభాగ్యం ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థ నుంచి 3.74 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే, అప్పు తీసుకున్నా, నెలకు 30% వడ్డీ చెల్లించాల్సి ఉండగా, వారి సంస్థ ఆర్థిక ఇబ్బందుల వల్ల చెల్లింపులు నిలిచిపోయాయి.
ఈ మొత్తాన్ని వినియోగించి ‘జగజాల కిల్లాడి’ అనే చిత్రాన్ని ప్రారంభించారు. అయితే, ఈ చిత్రం నిర్మాణం పూర్తి కాకుండానే అది పూర్తయిందని వెల్లడించారు. అప్పు ఇచ్చిన ధనభాగ్యం ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ, దుష్యంత్ నుండి తన సొమ్ము తిరిగి పొందేందుకు కోర్టును ఆశ్రయించడంతో వివాదం ముదిరింది. కోర్టు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచించింది. కానీ, అప్పుడు కూడా దుష్యంత్ నిజాలను దాచిపెట్టే ప్రయత్నం చేశారని కోర్టు అభిప్రాయపడింది.
కోర్టు ముందు, ‘జగజాల కిల్లాడి’ చిత్రాన్ని ధనభాగ్యం సంస్థకు అందజేయాలని మధ్యవర్తి సూచించగా, దుష్యంత్ సినిమా పూర్తిగా చిత్రీకరించలేదని అంగీకరించారు. అప్పు తీసుకున్న సొమ్మును ఇతర ఖర్చులకు వినియోగించానని ఆయన కోర్టులో ఒప్పుకున్నారు. దీనిపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఉమ్మడి ఆస్తిగా దక్కిన తాత గారి(శివాజీ గణేశన్) ఇంటిని జప్తు చేసి తాళాలు వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
తమిళ సినీ పరిశ్రమలో శివాజీ గణేశన్‌కు ఉన్న గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఆయన ఇంటి ఇలా జప్తు కావడం చాలా బాధాకరమైన పరిణామం. అభిమానులు, సినీ ప్రముఖులు దీనిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక వివాదాలు ఎంత దూరం వెళ్తాయనడానికి ఇది ఉదాహరణగా మారింది. ఇప్పటికే ఇంటిపై తాళాలు వేసిన అధికారులు, తదుపరి పరిణామాలను పరిశీలిస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం, అప్పు తిరిగి చెల్లించే వరకు ఇల్లు జప్తుగా కొనసాగనుంది. అయితే, దుష్యంత్ ఈ సమస్యను పరిష్కరించుకునే మార్గం వెతుకుతారా? లేక ఇంటిని అమ్మేస్తారా అనేది చూడాలి.