లగచర్ల,హకీంపేట భూసేకరణపై హైకోర్టు సంచలన తీర్పు!
లగచర్ల, హకీంపేటలో భూసేకరణపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ భూములకు సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేసింది;
లగచర్ల, హకీంపేటలో భూసేకరణపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ భూములకు సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. లగచర్ల, హకీంపేట భూసేకరణపై స్టే విధించింది. భూసేకరణ నోటిఫికేషన్ లో ఉన్న 8 ఎకరాల వరకు ఉన్న భూసేకరణను ఆపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
దుద్యాల మండలంలోని లగచర్ల, పోలేపల్లి, హకీంపేట్, పులిచర్లకుంట తండా, రోటిబండ తండాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 1177 ఎకరాల భూసేకరణకు టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 534 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 643 ఎకరాలు పట్టా భూమి ఉందని వెల్లడించారు దుద్యాల తహసీల్దార్ కిషన్.
నష్టపరిహారం కింద ఎకరాలకు రూ.20 లక్షలు, 150 గజాల ప్లాటు, ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇంటి మంజూరుకు వికారాబాద్ కలెక్టర్ రైతులకు హామీ ఇవ్వడంతో భూసేకరణకు అంగీకరించారు. పోలేపల్లి, హకీంపేట్, పులిచర్లకుంట తండాలో ఇప్పటికే సర్వే పూర్తయింది. పోలేపల్లి రైతులకు నష్టపరిహారం అందించారు. రోటిబండ తండా పరిధిలో ఉన్న 17 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు అధికారులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుందన్న సంగతి తెలిసిందే.
కాగా, బాధితుల తరఫున హకీంపేటకు చెందిన శివకుమార్ పిటిషన్ వేయగా..అడ్వొకేట్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. విచారణ జరిపిన జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం.. భూసేకరణపై స్టే విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ..తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం.
ఆ మధ్య లగచర్ల రైతుల ఆందోళన రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ తీవ్రంగా విరుచుకుపడింది. ఆ పార్టీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, పలువురు రైతులు జైలుకు కూడా వెళ్లారు. ఈనేపథ్యంలో హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.