పోసానికి బెయిల్ మంజూరు... వంశీ, వర్మ పరిస్థితి ఏమిటంటే..?

అవును... జనసేన నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.;

Update: 2025-03-07 10:35 GMT

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో పాటు పలువురు నాటి ప్రతిపక్ష నేతలపై వైసీపీ నేత, నటుడు, పోసాని కృష్ణ మురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల మేరకు కేసు నమోదవ్వడం.. కోర్టు రిమాండ్ విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పోసానికి బెయిల్ మంజూరైంది.

అవును... జనసేన నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆయనపై 196, 353 (2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రిమాండ్ నేపథ్యంలో ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించింది. ఈ మేరకు కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా.. పోసాని కస్టడీని కొట్టివేసింది. ఈ కేసులో పోసాని తరుపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

మరోపక్క మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. మరింత సమాచారం రాబట్టేందుకు వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసినట్లు తెలిపారు.

అయితే.. సత్యవర్ధన్ కిడ్నాప్ కు వంశీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన తరుపు న్యాయవాదులు తెలిపారు. ఈ సమయంలో.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.

ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విషయానికొస్తే... ఆయనకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. సీఐడీ నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ పై ఆరు వారాల స్టే విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News