న్యాయం కోసం బెంగాల్ వైద్యురాలి తల్లిదండ్రుల పిటీషన్..కొట్టేసిన సుప్రీంకోర్టు

ఆగస్టు 9వ తేదీ రాత్రి కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన దారుణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.;

Update: 2025-03-17 14:36 GMT

ఆగస్టు 9వ తేదీ రాత్రి కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన దారుణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో ఒంటరిగా నిద్రిస్తున్న ఒక యువ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా, సంజయ్ రాయ్ అనే వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఆధారాలు సేకరించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

కోర్టులో జరిగిన విచారణలో సాక్ష్యాధారాలు నిందితుడిని దోషిగా నిరూపించాయి. సంజయ్ రాయ్ తాను నేరం చేయలేదని, తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని వాదించినా, న్యాయస్థానం అతడి వాదనలను తోసిపుచ్చింది. చివరికి కోర్టు అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.

అయితే ఈ కేసు అక్కడ ముగియలేదు. ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. కానీ హైకోర్టు ఆ అప్పీల్‌ను స్వీకరించడానికి నిరాకరించింది. మరోవైపు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కూడా ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌ను మాత్రం హైకోర్టు విచారణకు స్వీకరించింది.

ఇదిలా ఉండగా తమ కుమార్తెకు జరిగిన అన్యాయానికి పునర్విచారణ జరగాలని కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారు ఈ కేసును సీబీఐతో విచారించాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు వారి పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి నిరాకరించింది. తాజాగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను పూర్తిగా కొట్టివేసింది. అయితే మృతురాలి తల్లిదండ్రులు ఇదే అంశంపై కలకత్తా హైకోర్టులో తమ పోరాటం కొనసాగించవచ్చని సూచించింది.

తమ కుమార్తెను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. న్యాయం కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు సూచన మేరకు వారు ఇప్పుడు కలకత్తా హైకోర్టులో తమ ఆఖరి ప్రయత్నం చేయనున్నారు. ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

- ఆర్జీకర్ వైద్యురాలి హత్యచారం కేసులో కీలక పరిణామాలు ఇవీ..

ఆర్జీకర్ వైద్య కళాశాలలో జరిగిన వైద్యురాలి హత్యచారం కేసు 2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చోటు చేసుకుంది. 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌ను కళాశాల భవనంలోని సెమినార్ హాల్‌లో అత్యాచారం చేసి హత్య చేశారు. బాధితురాలు 36 గంటల షిఫ్ట్‌లో డ్యూటీలో ఉండగా ఈ దారుణం జరిగింది. మరుసటి రోజు కోల్‌కతా పోలీసులు సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతను ఆసుపత్రిలో వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు.కేసు తీవ్రత దృష్ట్యా కలకత్తా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను సీల్దా కోర్టు దోషిగా నిర్ధారించింది.2025 జనవరి 20న సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

బాధితురాలి కుటుంబ సభ్యులు ఈ తీర్పును వ్యతిరేకించారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలపై ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ అభిజిత్ మండల్‌ను కూడా అరెస్టు చేశారు. అయితే వారికి బెయిల్ లభించింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైద్య సిబ్బంది భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి.

Tags:    

Similar News