53 కేజీల గోల్డ్ తుప్పు పట్టేస్తుంది.. గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టు షాక్!

ఈ కేసుల విచారణను 4 నెలల్లోగా పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా తెలంగాణ హైకోర్టులో గాలి కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది!;

Update: 2025-03-14 04:31 GMT

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసుల విచారణలో సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుల విచారణను 4 నెలల్లోగా పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా తెలంగాణ హైకోర్టులో గాలి కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది!

అవును... గాలి జనార్దన్ రెడ్డి, ఆయన కుమారుడు కిరీట్ రెడ్డి, కుమార్తె బ్రాహ్మణి తెలంగాణ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో భాగంగా... ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు తుప్పుపట్టిపోతాయంటూ గాలి జనార్దన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో... ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్ చేసిన నగదు, రూ.5 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలని పిటిషన్లలో కోరారు. అయితే... అందుకు హైకోర్టు అంగీకరించలేదు. బంగారు నగలు తుప్పుపట్టిపోతాయని, విలువ తగ్గుతుందన్న గాలి జనార్దన్ రెడ్డి అభ్యర్థనను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

అదేవిధంగా... ఓఎంసీ కేసు విచారణ పూర్తైన తర్వాతే వాటిపై హక్కులు తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్ ద్వారా రూ.884.13 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని సీబీఐ కేసు నమోదుచేసి, నేరపూరిత సొమ్ముతో కొన్న నగలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హక్కులు కోరుతోందని.. అందువల్ల ఈ దశలో వాటిని అప్పగించాలనే ఉత్తర్వ్యులు ఇవ్వలేమని తెలిపింది.

కాగా... 2011 సెప్టెంబర్ 5న ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో 53 కిలోలున్న సుమారు 105 బంగారు ఆభరణాలు, నగదు, బాండ్లను సీబీఐ సీజ్ చేసింది. బాండ్లను విడుదల చేయొద్దంటూ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ కు లేఖ రాసింది.

Tags:    

Similar News