1986లో అత్యాచారం కేసు... 2025లో సంచలన తీర్పు!

ఇదే క్రమంలో తాజాగా సుమారు 40 ఏళ్ల నాటి అత్యాచార కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.;

Update: 2025-03-20 05:36 GMT

రెండు రోజుల క్రితం నాలుగు దశాబ్ధాలకు పైగా నలుగుతోన్న కేసులో సంచలన తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. సుమారు 44 ఏళ్ల క్రితం జరిగిన దిహులి దళిత ఊచకోత కేసులో న్యాయస్థానం ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా ముగ్గురికి మరణశిక్ష విధించింది. ఇదే క్రమంలో తాజాగా సుమారు 40 ఏళ్ల నాటి అత్యాచార కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

అవును... సుమారు 40 ఏళ్ల క్రితం అత్యాచారానికి గురైన ఓ బాధితురాలికి ఎట్టకేలకు న్యాయం లభించింది. ఇందులో భాగంగా... ఈ కేసులో నిందితుడిని నిద్రోషిగా ప్రకటిస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సందర్భంగా.. నిందితుడికి శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. బాధితురాలు ఆనందం వ్యక్తం చేసింది.

ఈ దేశంలో ఏ నేరస్తుడూ చట్టం నుంచి తప్పించుకోలేడని సమాజానికి సందేశం పంపే ఘటనలు ఇటీవల వరుసగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సంచలనంగా మారిన కేసు వివరాలు ఇప్పుడు చూద్దామ్..!

వివరాళ్లోకి వెళ్తే.... 1986లో రాజస్థాన్ కు చెందిన ఓ మైనర్ అమ్మాయిపై 21 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో... బాధితురాలి ఫ్యామిలీ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు జరిపారు. ఈ నేపథ్యంలో 1987లో ట్రయల్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

దీంతో... అతడు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో సుదీర్ఘకాలం విచారణ తర్వాత.. 2013లో నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో... బాధితురాలి ఫ్యామిలీ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టిన సుప్రీంకోర్టు.. నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అతడు నాలుగు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాలని.. శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ధర్మాసనం బాధితురాలి పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా... తమ జీవితంలో జరిగిన ఈ భయానక అధ్యాయానికి ముగింపు పలికేందుకు బాధితురాలు, ఆమె ఫ్యామిలీకి సుమారు నలభై ఏళ్లు ఎదురుచూడాల్సి రావడం బాధాకరమని.. విచారణ సమయంలో బాధితురాలు కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏం జరిగిందో చెప్పలేకపోవడం వాస్తవమే అని.. ఆమె వాంగ్మూలం ఆధారంగా మొత్తం విచారణ భారాన్ని ఆమె భూజాన వేయడం సరికాదని తెలిపింది.

మైనర్ గా ఉన్నప్పుడు జరిగిన ఘటన కారణంగా మానసిక కుంగుబాటుకు లోనవడం వల్లే బాధితురాలు మౌనంగా ఉండిపోయిందని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News