"కెపాసిటీ ఉన్న మహిళలకు భరణం ఎందుకు?"... హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
డిసెంబర్ 2019లో ఓ జంట వివాహం చేసుకుంది. అనంతరం దంపతులిద్దరూ సింగపూర్ వెళ్లిపోయారు.;
డిసెంబర్ 2019లో ఓ జంట వివాహం చేసుకుంది. అనంతరం దంపతులిద్దరూ సింగపూర్ వెళ్లిపోయారు. అయితే.. భర్త, అతడి కుటుంబ సభ్యులు తనపై క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ 2021లో ఆ మహిళ భారత్ కు తిరిగి వచ్చేసింది. ఈ సమయంలో 2021 జూన్ లో భర్త నుంచి భరణం కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ సమయంలో భర్త బాగా సంపాదిస్తూ సంపన్న లైఫ్ స్టైల్ గడుపుతుండగా.. తాను మాత్రం ఆదాయం లేకుండా ఉన్నానని, ఈ క్రమంలో భారత్ తిరిగిరావడానికి తన నగల్ని కూడా అమ్మేశానని చెప్పింది. ఈ సమయంలో ఢిల్లీ హైకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది.. భరణానికి నిరాకరించింది. ఈ వ్యవహారం కీలకంగా మారింది.
అవును... ఈ కేసుకు సంబంధించిన మార్చి 19న జస్టిస్ చంద్రధారి సింగ్ మాట్లాడుతూ... సీ.ఆర్.పీ.సీ.లోని సెక్షన్ 125 జీవిత భాగస్వాముల మధ్య సమానత్వాన్ని కొనసాగించడానికి.. భర్య, పిల్లలు, తల్లితండ్రులకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించినదని.. అంతే కానీ.. పనిచేయకుండా ప్రోత్సహించేందుకు కాదని అన్నారు!
సంపాదించే సామర్థ్యం ఉన్నప్పటికీ.. అర్హత కలిగిన మహిళలు తమ భర్తల నుంచి మధ్యంతర భరణాన్ని కోరకూడదని ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. విడిపోయిన భర్త నుంచి మధ్యంతర భరణాన్ని నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా మహిళ దాఖలు చేసిన పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆస్ట్రేలియా నుంచి మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండి, విదేశాల్లో పనిచేసిన అనుభవం కూడా కలిగిన మహిళ.. భరణాన్ని డిమాండ్ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది! పిటిషనర్ గా ఉన్న మహిళకు బలమైన విద్య నేపథ్యం ఉందని.. ప్రపంచ వ్యవహారాలపై అవగాహన కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇదే సమయంలో... బ్రతకడం కోసం భాగస్వాములపై ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉన్న మహిళల మాదిరిగా కాకుండా.. ఆమె స్వయంగా సంపాదించే అవకాశం ఉన్నందు వల్ల భరణంపై ఆధారపడకుండా జాబ్ వెతుక్కోవాలని కోర్టు ఆమెకు సూచించింది! ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది!