మేటర్ సీరియస్... అత్యాచార ఘటనలో జడ్జి వ్యాఖ్యలు ఖండించిన మంత్రి!
దీనిపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి స్పందించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.;
అత్యాచారయత్నం కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని అటు పలువురు సీనియర్ లాయర్లు, మహిళలు, నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమయంలో కేంద్రమంత్రి స్పందించారు.
అవును... మైనర్ బాలిక వక్షోజాలు పట్టుకుని, ఆమె ఫ్యాంట్ నాడా కట్ చేసినంత మాత్రాన్న అత్యాచారయత్నం చేసినట్లు కాదన్నట్లుగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. దీనిపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి స్పందించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగా... ఈ తీర్పు ఏమాత్రం సమ్మతం కాదని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరారు. ఇటువంటి తీర్పులతో సమాజంలో తప్పుడు సంకేతాలు, సందేశాలు వెళ్లే అవకాశం ఉందని అన్నారు.
కాగా... 2021 నవంబర్ లో ఉత్తర్ ప్రదేశ్ లోని కాస్ గంజ్ ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల మైనర్ బాలిక తన తల్లితో కలిసి బందువుల ఇంటి నుంచి తిరిగి నడుస్తూ వెళ్తోంది. ఈ సమయంలో అటువైపు బండిపై వస్తున్న అదే గ్రామానికి చెందిన పవన్, ఆకాష్.. ఆమెను గ్రామంలో వదిలిపెడతామని చెప్పి బండి ఎక్కించుకున్నారు.
మార్గమధ్యలో ఆమెను కిందకు దింపి.. ఆ చిన్నారి వక్షోజాలు పట్టుకుని.. కల్వర్టు కిందకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు! ఇదే సమయంలో ఆమె పైజామా నాడాలు కట్ చేసి ఫ్యాంటు కిందకు లాగే ప్రయత్నం చేశారు! ఈ సమయంలో బాలిక హాహాకారాలు విన్న స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో.. ఆ యువకులు ఇద్దరూ అక్కడ నుంచి పారిపోయారు.
దీంతో.. విషయం తెలుసుకొన్న బాలిక తల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితులపై కేసు పెట్టారు. అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఈ సందర్భంగా.. జస్టిస్ రామ్ మనోహర్ నారయాణ్ మిశ్రా స్పందిస్తూ... నిందితులపై మోపబడిన ఆరోపణలు, కేసు వాస్తవాలు, ఈ కేసులో అత్యాచారయత్న నేరంగా పరిగణించబడవని అన్నారు.
బాలికపై అత్యాచారయత్నం చేయాలని ప్రయత్నించడానికి, నేరం చేయడానికి వ్యత్యాసం ఉంటుందని వివరించారు. బాధితురాలి వక్షోజాలు తాకారు, పైజామా నాడాలు కట్ చేసి, ఆమెను కల్వర్టు కిందకు లాగేందుకు ప్రయత్నించారే తప్ప.. ఆమెపై వారు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారని చెప్పే సాక్ష్యాలు లేవని అన్నారు! దీంతో.. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి!