2008 నుంచి ఐపీఎల్ లో ఎక్కడా ఆగలే.. అందరూ ఇండియన్సే..

2008 ఏప్రిల్ లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ లోకి అడుగుపెట్టింది. అంటే మరో రెండేళ్లలో రెండు దశాబ్దాల ప్రయాణం పూర్తి చేసుకోనుంది;

Update: 2025-03-21 15:35 GMT

2008 ఏప్రిల్ లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ లోకి అడుగుపెట్టింది. అంటే మరో రెండేళ్లలో రెండు దశాబ్దాల ప్రయాణం పూర్తి చేసుకోనుంది. కాబట్టి.. తొలి సీజన్ నుంచి ఆడుతున్న ఆటగాళ్లు అతికొద్దిమందే ఉంటారని చెప్పొచ్చు.. ఉన్నారు కూడా.. వీరిలో అందరూ టీమ్ ఇండియా కు చెందినవారే కావడం విశేషం. కొందరు ఇంకా టీమ్ ఇండియాకు ఆడుతుండడం ఇంకాస్త విశేషం.

జట్టు మారకుండా..

ఐపీఎల్ లో ఆటగాళ్లు జట్లు మారడం సహజం. కానీ, ఇద్దరే ఇద్దరు ఒక్కసారీ జట్టు మారలేదు. మరీ ఒకరైతే ఒకటే జట్టుకు ఆడుతున్నారు. వారు.. విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోనీ.

చెన్నై సూపర్ కింగ్స్‌కు 2008 నుంచి ఆడుతున్న ధోనీ ఐదు టైటిల్స్ సాధించిపెట్టాడు. మధ్యలో రెండేళ్లు చెన్నైపై నిషేధం విధించడంతో పుణె సూపర్ జెయింట్స్ గా మారిన సంగతి తెలిసిందే. అప్పుడూ ధోనీ జట్టులో ఉన్నాడు.

లీగ్‌ లో ఎక్కువ మ్యాచ్‌ లు ఆడినది ధోనీనే. 264 మ్యాచ్ లలో 5,243 పరుగులు చేశాడు.

ధోనీ అయినా పరిస్థితుల రీత్యా పుణె తరఫున ఆడాడు కానీ, కోహ్లి మాత్రం మొదటినుంచి ఒకటే జట్టు.. ఆర్సీబీకి ఆడుతున్నాడు. అయితే, ఆర్సీబీకి టైటిల్ కొట్టలేకపోవడం ఒక్కటే లోటు. కోహ్లి 252 మ్యాచ్ లాడి 8,004 పరుగులు చేశాడు. వీటిలో 8 సెంచరీలు ఉన్నాయి.

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ ప్రాయాణం

2008లో డెక్కన్‌ చార్జర్స్ ద్వారా మొదలైంది. ముంబై ఇండియన్స్ కు మారిన అతడు 257 మ్యాచ్‌లలో 6,628 పరుగులు చేశాడు. అన్నిటికి మించి ముంబైకి తన సారథ్యంలో ఐదు కప్‌ లు అందించాడు. డెక్కన్ చార్జర్స్‌ 2009లో ట్రోఫీ గెలిచినప్పుడు కూడా రోహిత్‌ ఆ జట్టు సభ్యుడు.

టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 240 మ్యాచ్ లలో 2,959 పరుగులు, 160 వికెట్లు పడగొట్టాడు. తొలి రెండు సీజన్ లలో రాజస్థాన్ రాయల్స్, తర్వాత కోచి టస్కర్స్, గుజరాత్ లయన్స్ కు ఆడిన జడేజా 2018 నుంచి చెన్నైకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఈ సీజన్ కు కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అయిన అజింక్య రహానే కూడా 2008 నుంచి ఐపీఎల్ లో ఉన్నాడు. 185 మ్యాచ్‌ లు ఆడి 4,642 పరుగులు చేసిన రహానే.. కెప్టెన్ గా డిఫెండింగ్ చాంపియన్ ను నడిపించనున్నాడు.

2008 అండర్-19 ప్రపంచ కప్ సభ్యుడైన మనీశ్ పాండే అదే ఏడాది నుంచి ఐపీఎల్‌లో ఉన్నాడు. 171 మ్యాచ్‌ లలో 3,850 పరుగులు చేశాడు.

రవిచంద్రన్ అశ్విన్‌, కర్ణ్‌ శర్మ 2009 నుంచి ఆడుతున్నారు. అశ్విన్ 212 మ్యాచ్‌ లలో 180 వికెట్లు పడగొట్టాడు. 800 పరుగులు చేశాడు. స్పిన్నర్ కర్ణ్‌ శర్మ 84 మ్యాచ్‌ లలో 76 వికెట్లు తీశాడు.

Tags:    

Similar News