ఐపీఎల్-18.. ఈ కుర్రాళ్లు అదుర్స్ అనిపిస్తారా?
సరిగ్గా మరికొన్ని గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మొదలుకానుంది.;
సరిగ్గా మరికొన్ని గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మొదలుకానుంది. అత్యంత సీనియర్లు రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్), విరాట్ కోహ్లి (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), మహేంద్ర సింగ్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్) గురించి ఎంత చర్చ జరగనుందో.. కొందరు కొత్త కుర్రాళ్లపైనా అంతే స్థాయిలో చర్చ నడుస్తోంది. వీరిలో ముగ్గురు భారతీయులతో పాటు ఇద్దరు దక్షిణాఫ్రికా మెరికలు ఉన్నారు. మరి వారెవరో తెలుసుకుందామా?
రూ.కోటితో కొట్టేసింది..
ముంబై చివరిసారిగా చాంపియన్స్ గా నిలిచింది 2020లో. అప్పట్లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అద్భుత ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇప్పుడు కూడా రోహిత్ ఓపెనింగ్ చేయనున్నాడు. అయితే అది ఇక్కడ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ మాత్రం ర్యాన్ రికిల్‌టన్. ముంబై ఇతడిని రూ.కోటితో కొనుక్కుంది. 177పైన స్ట్రెక్ రేట్‌తో రికిల్ టన్ చెలరేగడంతో దక్షిణాఫ్రికా(ఎస్‌ఏ)20 టోర్నీలో ముంబై కేప్ టౌన్ టైటిల్ గెలిచింది. నిరుడు మేజర్ లీగ్ క్రికెట్లో సీటెల్ ఆర్కాస్ తరఫున 63 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికా తరపున కూడా మంచి ఇన్నింగ్స్ ఆడిన రికిల్ టన్ ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ను ఎలా నిర్మిస్తాడో చూద్దాం.
ఇంగ్లండ్ తాజా సంచలనం జాకబ్ బెతెల్. ఇటీవలి భారత టూర్ లో రాణించాడు. వాస్తవానికి ఇతడు బార్బడోస్ లో పుట్టాడు. వయసు 21 ఏళ్లే. ఎడమచేతి వాటం స్పిన్ తో పాటు దూకుడుగా బ్యాటింగ్ చేసే బెతెల్.. అండర్-19 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ ను ఫైనల్ చేర్చాడు. బెతెల్ సూపర్ ఫీల్డర్. అందుకే ఆల్ రౌండర్ల కొరతతో అల్లాడే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.2.60 కోట్లు పెట్టి కొనుక్కుంది.
ఇతడొక తుఫాను
తొలి వన్డే ఇన్నింగ్స్ లోనే న్యూజిలాండ్ పై 150 పరుగులు కొట్టాడు మాథ్యూ బ్రిట్జ్ కే. ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. అరంగేట్ర వన్డేలోనే అత్యధిక స్కోరు సాధించినవాడిగా రికార్డు సృష్టించాడు. దూకుడు దూకుడే.. ఇన్నింగ్స్ నిర్మాణం ఇన్నింగ్స్ నిరామణమే అన్నది ఇతడి ప్రత్యేకత. మెగా వేలంలో లక్నో ఇతడిని సొంతం చేసుకుంది.
భారత్ కు చెందిన 13 ఏళ్ల బిహారీ బాబు వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఆడిస్తుందా? లేదా? అన్నది చూడాలి. వేలంలో రూ.1.10 కోట్లకు ఇతడిని రాజస్థాన్ కొనుక్కుంది. దూకుడుగా ఆడే ఎడమ చేతివాటం ఓపెనర్ అయిన వైభవ్ కు రాజస్థాన్ తుది జట్టులో చోటిస్తుందా? అన్నది ఆసక్తికరం. అయితే, ఈ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్. అందుకని వైభవ్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గానైనా ఆడిస్తారని భావిస్తున్నారు.
ముషీర్ ఖాన్.. నిరుడు దేశవాళీల్లో దుమ్మురేపుతున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై వెనుకబడ్డాడు. టీమ్ ఇండియా టెస్టు బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ సొంత తమ్ముడైన 20 ఏళ్ల ముషీర్.. 2024లో అండర్-19 ప్రపంచ కప్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. పంజాబ్ కింగ్స్ ఇతడిని రూ.30 లక్షలకు తీసుకుంది. 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలోనే 3 సెంచరీలు కొట్టిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ బాదాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ తో మ్యాచ్ ను మలుపు తిప్పే ముషీర్.. ఐదో బౌలింగ్ ప్రత్యామ్నాయం.
ముంబై అంటేనే.. టాలెంటెడ్ ప్లేయర్లను అందించే ఫ్యాక్టరీ. బుమ్రా, పాండ్యానే దీనికి ఉదాహరణ. ఇప్పుడు మరో టాలెంటెడ్ ప్లేయర్ దూసుకొస్తున్నాడు. అతడే రాబిన్ మింజ్. వినడానికి విదేశీ ఆటగాడిలా ఉన్నప్పటికీ 22 ఏళ్ల ఈ కుర్రాడిది జార్ఖండ్. ఈ రాష్ట్రానికే చెందిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తరహాలో పవర్ హిట్టర్. పైగా వికెట్ కీపర్ కూడా. దీనికితోడు ఎడమ చేతి వాటం బ్యాటర్. జార్ఖండ్ కే చెందిన ఇషాన్ కిషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు వెళ్లడంతో ముంబై రాబిన్ మింజ్ ను ఫుల్ గా వాడుకోవడం ఖాయం. రూ.65 లక్షలకే ఈసారి ముంబైకి వెళ్లినా.. వచ్చే మినీ వేలంలో మాత్రం భారీ ధర పలకడం ఖాయం.