ఐపీఎల్ లో 500 కొడితే.. టీమ్ ఇండియాలోకి డైరెక్ట్ ఎంట్రీనా?

ఏమంటే ఐపీఎల్ ప్రదర్శనా..? లేక దేశవాళీల్లో ప్రదర్శనా? అని. కొంతకాలంగా చూస్తుంటే ఐపీఎల్ ప్రదర్శనను లిమిటెడ్ ఓవర్ల వరకు మాత్రం పరిగణిస్తున్నారు.;

Update: 2025-03-21 12:30 GMT

చాలాకాలంగా.. అదీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదలయ్యాక భారత దేశ క్రికెట్ జట్టు ఎంపికపై ఒకటే విమర్శ.. అది జాతీయ జట్టులోకి వచ్చేందుకు ప్రామాణికత

ఏమంటే ఐపీఎల్ ప్రదర్శనా..? లేక దేశవాళీల్లో ప్రదర్శనా? అని. కొంతకాలంగా చూస్తుంటే ఐపీఎల్ ప్రదర్శనను లిమిటెడ్ ఓవర్ల వరకు మాత్రం పరిగణిస్తున్నారు. మరీ చెప్పాలంటే.. టి20లకు వెంటనే ఎంపిక చేస్తున్నారు. హైదరాబాదీ తిలక్ వర్మ, ఆంధ్రాకు చెందిన ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, యూపీకి చెందిన రింకూ సింగ్.. ఒకరేమిటి..? ఎందరో కుర్రాళ్లు ఐపీఎల్ ద్వారా టీమ్ ఇండియా టి20 జట్టుకు ఎంపికయ్యారు. టెస్టులు, టి20ల్లో రెగ్యులర్ ప్లేయర్ అయిన ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ను ఎంపిక చేయడంలో కూడా ఐపీఎల్ పాత్ర ఉందనే చెప్పాలి.

ఐపీఎల్ తొలి మెట్టు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) యువ క్రికెటర్లకు మంచి వేదిక అని చెప్పడంలో సందేహం లేదు. అయితే, క్రికెట్ లో అసలు ప్రామాణికమే కాని టి20 ఫార్మాట్ లో ప్రదర్శన ఆధారంగా జాతీయ జట్టుకు ఎంపిక చేయడం ఏమిటనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ, వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఇప్పుడు ఇదే విషయమై టీమ్ ఇండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా స్పందించాడు. యువ క్రికెటర్లు వర్తమానంపై దృష్టిపెడితే చాలని అన్నాడు. దీంతో అవకాశాలు వాటంతటవే వచ్చేస్తాయని పేర్కొన్నాడు. నిలకడగా ఆడితే ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని తెలిపాడు.

ఒక సీజన్‌లో 500 పైగా పరుగులు చేస్తే తప్పకుండా టీమ్ ఇండియాకు ఆడే చాన్స్‌ వస్తుందన్నాడు. ప్రతి ఐపీఎల్‌ సీజన్‌ ను సద్వినియోగం చేసుకోవాలని.. భయం లేకుండా ఆడుతూ టెక్నిక్‌ తో పాటు యాటిట్యూడ్‌ ను మెరుగుపర్చుకోవాలని హితవు పలికాడు. ఐపీఎల్‌ చాలా పెద్ద వేదిక అని.. అందులో సత్తా చాటితే వెనక్కితిరిగి చూసుకోనక్కర్లేదని విశ్లేషించాడు.

ఐపీఎల్ లో మొదటినుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన సురేశ్ రైనా.. కొవిడ్ సమయంలో కెప్టెన్ గానూ పదోన్నతి పొందాడు. కెప్టెన్ ధోనీ తలా కాగా.. రైనా చిన్న తలాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2020/21 సీజన్ లో అతడి తీరు సరిగా లేకపోవడం వివాదం రేపింది. ఆ తర్వాత అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.

Tags:    

Similar News