2 రోజుల్లో ఐపీఎల్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పు.. ఎందుకో?
తెలుగు ఆటగాళ్లు అంబటి రాయుడు నుంచి తిలక్ వర్మ వరకు ఇది నిజమైంది కూడా.;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ (ఎంఐ). భారీ ధరతో మంచి ఆటగాళ్లను తీసుకోవడమే కాదు.. ప్రతిభావంతులను వెదికిపట్టుకోవడంలోనూ ముంబై ముందుంటుంది. అందుకనే ముంబైకి ఆడితే టీమ్ ఇండియాకు ఎంపికైనట్లే అంటారు. తెలుగు ఆటగాళ్లు అంబటి రాయుడు నుంచి తిలక్ వర్మ వరకు ఇది నిజమైంది కూడా.
17 సీజన్లలో ఐదుసార్లు టైటిల్ నెగ్గడం అంటే మామూలూ మాటలు కాదు. వాస్తవానికి ముంబై 13 సీజన్లలోనే ఐదు టైటిల్స్ కొట్టింది అని చెప్పాలి. 2020లో చివరగా చాంపియన్ గా నిలిచింది. 2021 నుంచి ముంబై ప్రదర్శన పడిపోతోంది. అయినా ఆ జట్టును తేలిగ్గా తీసివేయడం కష్టం.
మూడేళ్లుగా కప్ కొట్టడంలో విఫలం అయినందుకో ఏమో..? గత సీజన్ కు ముందు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించి.. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తెచ్చుకుని మరీ కెప్టెన్ ను చేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. కానీ, ఈ ప్రయోగం బెడిసింది. ఒకప్పుడు ముంబై ద్వారానే వెలుగులోకి వచ్చినప్పటికీ హార్దిక్ రాకతో జట్టులో తేడా వచ్చింది. కెప్టెన్ గా అతడి యాటిట్యూట్ కూడా దీనికి కొంత కారణమైంది.
ఇప్పుడు కొత్త సీజన్ లోనూ హార్దిక్ సారథ్యంలోనే ముంబై ఐపీఎల్ ఆడనుంది. అయితే, ఇక్కడే అనూహ్యం చోటుచేసుకుంది. తొలి మ్యాచ్ లో హార్దిక్ ఆడడం లేదు.
గత ఏడాది స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ ఒక మ్యాచ్ సస్పెన్షన్ కు గురయ్యాడు. దీంతో ఈ నెల 23న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో అతడు ఆడే అవకాశం లేదు. దీంతో ఈ మ్యాచ్ కు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను నియమించింది ముంబై మేనేజ్‌మెంట్. ఈ మ్యాచ్ తర్వాత హార్దిక్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. చెపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో హార్దిక్, టీమ్ ఇండియా ప్రధాన పేసర్ బుమ్రా కూడా ఆడడం లేదు. అంటే ముంబైకి డబుల్ స్ట్రోక్ అన్నమాటట వెన్ను నొప్పి నుంచి కోలుకుంటున్న బుమ్రా.. తిరిగొచ్చేది ఎప్పుడో స్పష్టత లేదు.