చేతులు మారిన ఐపీఎల్ జట్టు.. 67 శాతం వాటా.. రూ.వేల కోట్లు?

టీమ్ ఇండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ కెప్టెన్సీలో రాబోయే ఐపీఎల్ సీజన్ బరిలో దిగబోతున్నది గుజరాత్ టైటాన్స్ (జీటీ);

Update: 2025-03-18 12:16 GMT

ఆడింది మూడు సీజన్లు.. తొలి సీజన్ లోనే గెలుపు.. పెద్ద పెద్ద జట్లకూ సాధ్యం కాని రికార్డు ఇది.. రెండో సీజన్ లోనూ ఫైనల్స్ కు.. దాదాపు టైటిల్ కొట్టేసేదే.. త్రుటిలో చేజారింది.. ఇక మూడో సీజన్ నాటికి కెప్టెన్ మారిపోవడంతో ప్రదర్శన పడిపోయింది. అయితే, వచ్చే సీజన్ లోనూ ఆ జట్టును తీసిపారేయలేం..

టీమ్ ఇండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ కెప్టెన్సీలో రాబోయే ఐపీఎల్ సీజన్ బరిలో దిగబోతున్నది గుజరాత్ టైటాన్స్ (జీటీ). 2022లో విన్నర్, 2023లో రన్నరప్ అయిన గుజరాత్ నిరుడు సరైన ప్రదర్శన చేయలేకపోయింది.

ఈసారి మాత్రం గిల్ సూపర్ ఫామ్ లో ఉండగా.. కొత్త ఆటగాళ్ల చేరికతో గుజరాత్ అద్భుతం చేస్తుందేమో చూడాలి. ఇక ఈ జట్టులోని ప్రధాన స్పిన్నర్ రషీద్ ఖాన్ సంగతి తెలిసిందే. ఇతడికి తోడు హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ను గుజరాత్ వేలంలో తీసుకుంది.

గుజరాత్ టైటాన్స్ మెజారిటీ వాటాను టొరెంట్‌ గ్రూపు సొంతం చేసుకుంది. 67 శాతం వాటాను కొన్నట్లు సోమవారం ప్రకటించింది. వాటా కొనుగోలు, బదలాయింపులకు సంబంధించి బీసీసీఐతో సహా అన్ని ఆమోదాలు లభించినట్లు తెలిపింది. సీవీసీ క్యాపిటల్‌ పార్ట్‌ నర్స్‌ కు చెందిన ఇరేలియా స్పోర్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 2021లో గుజరాత్‌ టైటాన్స్‌ ను కొనుగోలు చేసింది. ఇకపై సీవీసీ క్యాపిటల్స్‌ 33 శాతం వాటాతో ఉండనుంది. కాగా, వాటా కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల గురించి సంస్థ వివరించలేదు. అయితే, ఆ మొత్తం రూ.వేల కోట్లలోనే ఉండే చాన్సుంది. వివరాలు తర్వాత బయటకు వచ్చే వీలుంది.

Tags:    

Similar News